ప్రజల్లో పబ్లిసిటీకి మైలేజ్ ఇచ్చే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి నాయకులు ఇష్టపడరు. అయితే ఇలాంటి ఘటనలే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు తెచ్చిపెడితాయి. ఏపీలో రాజధాని కోసం సేకరించిన భూములను చదును చేసే కార్యక్రమంలో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు. అంతేటితో ఆగకుండా వారిద్దరూ ట్రాక్టర్లు నడుపుతూ కాసేపు చదును చేసే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇక అప్పటికైనా వారిద్దరూ ఆగివుంటే బాగానే ఉండేది. ఒకరితో ఒకరు పోటీపడుతూ వేగంగా ట్రాక్టర్లను నడపడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారిద్దరు ట్రాక్టర్లు ఎదురెదురుగా వచ్చి స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి మంత్రులిద్దరూ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రులు పనులు ప్రారంభించి వెళ్లిపోక అత్యుత్సాహంతో ప్రమాదం కొనితెచ్చుకోబోయారంటూ అక్కడున్న టీడీపీ నాయకులు గుసగుసలాడుకున్నారు.