ఈసారి 'మా' ఎన్నికలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత దక్కింది. సాధారణ ఎన్నికలకు మించి ఎత్తుగడలు.. ప్రత్యర్థుల జిత్తులతో ఇండస్ట్రీ దాదాపు రెండువర్గాలుగా చీలిపోయింది. మొదట తాను బరిలో ఉన్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించగానే ఆయన గెలుపు సునాయాసమని అందరూ భావించారు. అంతలోనే కొందరు తెరవెనుక ఉండి జయసుధను బరిలోకి దింపారు. రోజురోజుకూ ఆమెకు మద్దతుదారుల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇక జయసుధ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. జయసు'ధ తరఫున మురళీమోహన్ అన్ని తానై వ్యవహారాలను చక్కబెట్టాడు. ఎప్పటినుంచి రాజకీయాల్లో, 'మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ సారథ్యంలోనే జయసుధ ప్రచారం కొనసాగించారు. అయితే 'మా' ఓటర్లు మాత్రం ఎన్నికల్లో జయసుధ వర్గానికి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ ఇచ్చారు. దాదాపు 700 ఓట్లు ఉన్న 'మా'లో రాజేంద్రప్రసాద్ 285 ఓట్లతో గెలవడం మొత్తం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అసలు ఎన్నికల్లో ఓడిపోతాడనుకున్న వ్యక్తి అనుహ్యంగా గెలవడమే కాకుండా అత్యంత భారీ మోజార్టీ సాధిస్తారని ఎవరూ ఊహించలేదు.
అయితే రాజేంద్రప్రసాద్ గెలుపునకు ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న మంచిపేరుతోపాటు మురళీమోహన్ కూడా తోడ్పడ్డారని ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. మురళీమోహన్ తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికల్లో ఒంటరిని చేయాలని ఎత్తుగడ వేశాడు. నటకిరీటికి మద్దతుగా ఎన్నికల్లో బరిలోకి దిగిన వారు కూడా పోటీనుంచి తప్పుకునేలా చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇది రాజేంద్రప్రసాద్‌కు ఓటర్లలో సానుభూతిని తెచ్చిపెట్టింది. ఇక ఇన్నాళ్లపాటు 'మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్ పేద నటీనటులకు చేసిన మేలేది లేదని, అతని వర్గంలో ఉన్న జయసుధను గెలిపించినా ఇదే రిపీట్ అవుతుందని కూడా పేద కళాకారులు ఆలోచించినట్లు తెలుస్తోంది. దాదాపు 700 మంది సభ్యులున్న 'మా'లో ఓ 100 మందిని మినహాయిస్తే మిగిలినవారంతా పేద కళాకారులేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇన్నాళ్లపాటు ఇండస్ట్రీకి వారు సేవలందించినా జీవితం చివరాంకంలో వారు కనీసం పింఛన్‌కు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇక మరణించిన సమయంలో అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ తంతును రాజేంద్రప్రసాద్ మారుస్తారన్న నమ్మకంతోనే ఆయనకు ఓటేసినట్లు చెబుతున్నారు. జయసుధ గెలుపు కోసం మురళీమోహన్ ఎంతగా ప్రయత్నించారో ఆమె ఓటమికి కూడా పరోక్షంగా కారణమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.