సీఎంలు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయడం ఎప్పుడూ జరగదు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన సీఎంలు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏం ఉంటుంది. అందునా అన్ని సమస్యలను పరిష్కరించే అధికారం తన చేతిలో ఉన్నప్పుడు వారికి ఆ అవసరం కూడా రాదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం ప్రత్యేకం. ఆయన ప్రజల దృష్టిని, పార్టీ కార్యకర్తల దృష్టిని పక్కకు మరల్చాలంటే మొదటగా ధర్నానే చేస్తారు.
ఆయన మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో శాంతిభద్రలను రాష్ట్రం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రోడ్డుమీదకు వచ్చి ధర్నా చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలో కూడా ఉండదని, మూడింట రెండువంతుల మెజార్టీతో పార్లమెంట్ ఆమోదం పొందితేనే ఈ చట్టాన్ని మార్చగలమని తెలిసి కూడా కేజ్రీవాల్ ధర్నా చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
అంతేకాకుండా ఇంతపెద్ద విషయానికి సంబంధించి కనీసం మొదటగా ఒక లేఖ కూడా రాయకుండా ఆయన నేరుగా వచ్చి రోడ్డు మీద ధర్నాకు దిగడాన్ని మీడియాతోపాటు అన్ని వర్గాలు తప్పుపట్టాయి. ఇదిసాకుగా చూపి కేజ్రీవాల్ అప్పట్లో గవర్నమెంట్‌ను కూల్చి మళ్లీ ఎన్నికలకు వెళ్లాడు. దీంతో ఆయన్ను నమ్మని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కలు చూపించారు. ఆ తర్వాత మళ్లీ ధర్నాలు చేయనని, బుద్ధిగా పాలిస్తానని నమ్మబలుకుతూ రెండోసారి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు. అయినా ఆయన తీరు మారలేదు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో పూర్తిగా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఎంగా కేజ్రీవాల్ రెండోసారి ధర్నాకు దిగారు. కేంద్రం ప్రవేశపెట్టన్ను భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేశారు. ఈ ధర్నాతో రెండోసారి ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తల దృష్టిని పక్కకు మరల్చడానికి ప్రయత్నించారు.