‘స్వామిరారా’ వంటి క్రైమ్ కామెడీతో ఓ కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుధీర్‌వర్మ తన రెండో చిత్రంగా నాగచైతన్య హీరోగా శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ‘దోచేయ్’ రూపొందించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలై నాగచైతన్య కెరీర్‌లో ఓ స్టైలిష్ మూవీ అనిపించుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌పై చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో 'సినీజోష్' ఇంటర్వ్యూ.
మీరు చేసిన రెండు సినిమాలూ క్రైమ్ బేస్డే. ఈ థెఫ్ట్ టెక్నిక్ అనేది ఎక్కడ పట్టుకున్నారు?
మనం చూస్తున్న సినిమాల ద్వారానే ఆ టెక్నిక్స్ అనేవి తెలుస్తుంటాయి. ఇలా చేస్తే తప్పించుకోవచ్చు అనే ఐడియా వస్తుంటుంది. అలాగే ఒరిజినల్‌గా దొంగతనాలు జరిగినవి సిసి ఫుటేజ్‌తో చేసిన డాక్యుమెంటరీలు బిబిసి ఛానెల్‌లో వస్తుంటాయి. అవన్నీ చూసి వాటి నుంచి ఇన్‌స్పైర్ చేసిన సినిమాలివి.
భీమవరం నుంచి వచ్చిన మీరు ఇంత అడ్వాన్స్‌డ్‌గా ఎలా ఆలోచించగలుగుతున్నారు?
భీమవరం మా సొంత ఊరే కానీ, అక్కడ వున్నది తక్కువ. స్కూలింగ్ వైజాగ్‌లో, ఇంజనీరింగ్ బళ్ళారిలో చేశాను.
వరసగా క్రైమ్ సబ్జెక్ట్స్ చెయ్యడానికి రీజన్ ఏదైనా వుందా?
ఫస్ట్ సినిమా క్రైమ్ కామెడీ చేశాను. రెండోది కూడా అలాంటి క్రైమ్ సబ్జెక్ట్‌తోనే చేస్తే బాగుంటుందనిపించింది. అలా ప్రొసీడ్ అయిపోయాను. అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. నాగచైతన్య కూడా ఏ కథ అయినా ఓకే అన్నారు. చైతుకి ఈ కథ అయితే బాగుంటుందని డిసైడ్ చేశాను.
‘స్వామిరారా’ చిత్రంలో కనిపించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నీషియన్సే ఈ సినిమాలోనూ కనిపించారు. ఎందుకలా?
స్వామిరారా స్మాల్ బడ్జెట్‌లో చేసిన సినిమా. రెండో సినిమాకి పెట్టుకోకపోతే ఫస్ట్ మూవీకి వాడుకొని వదిలేశాడంటారు. అయితే ఈ సినిమాలో ప్రవీణ్, సత్య, పూజ వారి క్యారెక్టర్లకు పర్‌ఫెక్ట్ సూట్ అవుతారని వారినే పెట్టుకోవడం జరిగింది. క్యారెక్టర్స్‌కి సూట్ అవుతారని పెట్టుకున్నాను కానీ, రిపీట్ చేద్దామని కాదు.
‘స్వామిరారా’ చిత్రం తర్వాత ‘దోచేయ్’ చెయ్యడంతో ఆడియన్స్‌లో అంచనాలు బాగా పెరిగిపోయాయి. దాన్ని క్యారీ చెయ్యడానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నేను అవన్నీ పెద్దగా మైండ్‌లో పెట్టుకోలేదు. నేను మొదటి సినిమా చేసినపుడు సుధీర్‌వర్మ అంటే ఎవరికీ తెలీదు. ఫస్ట్ సినిమాకి పేరొచ్చింది కాబట్టి రెండో సినిమాకి వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు వంటి వాటి గురించి ఆలోచించలేదు. నేను ఒక కథ అనుకున్నాను. హీరోకి చెప్పాను. అతనికి నచ్చింది. దాని ప్రకారం తీసుకుంటూ వెళ్ళాను.
క్లైమాక్స్‌లో తీసిన ఛేజ్ సీన్ లెంగ్తీ అయిందంటున్నారు. మీరేమంటారు?
ఆ ఛేజ్ అనేది సినిమాకి అవసరం అని నేననుకున్నాను. ఆ టైమ్ ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ వుంటే బాగుంటుందనిపించింది. నిజానికి ఆ ఛేజ్ ఆరు నిముషాలు వుంది. దాన్ని కట్ చేసి, కట్ చేసి రెండున్నర నిముషాలు పెట్టాల్సి వచ్చింది.
బిల్డింగ్స్ పై నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళే రిస్కీ షాట్స్ కూడా సినిమాకి అవసరం అనిపించిందా?
సినిమా అంటే ఏదైనా కొత్తదనం చూపించాలి. ఏదైనా ఆ సీన్స్ చాలా రిస్క్‌తో కూడుకున్నవి. రోప్స్ ఎక్కువగా వాడకుండా హెలీ కామ్స్ వాడాం. హెలీ కామ్ వాడినపుడు దానితో చిన్న షాట్ తియ్యలేం. కెమెరా వెళ్తుంటే హీరో జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అవన్నీ రిస్కీగా చేశాం. ఆ సీన్స్ అన్నీ బాగా వచ్చాయి కూడా.
నాగార్జునగారు సినిమా చూసి ఏమన్నారు?
చాలా స్టైలిష్‌గా చాలా బాగా తీశావు. నాకు మాత్రం బాగా నచ్చింది. చివరి అరగంట మాత్రం చాలా హిలేరియస్‌గా వుంది. డెఫినెట్ మనం ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ చేద్దాం అన్నారు. ‘దోచేయ్’ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడొచ్చి లైన్ చెప్పినా నేను రెడీ అన్నారు.
‘స్వామిరారా’తో ‘దోచేయ్’ని కంపేర్ చేస్తే ఏది బెటర్ మూవీ అంటారు?
‘స్వామిరారా’ అనేది నాకు డిఫరెంట్ మూవీ. అది ఒక స్క్రీన్‌ప్లే ప్యాట్రన్‌లో వెళ్ళాను. ఆ సినిమా తీసిన బడ్జెట్ వేరు, టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ వేరు. ‘దోచేయ్’ బడ్జెట్ వేరు, దీనికి టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ వేరు. ఇదే బడ్జెట్‌లో ఆ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని తియ్యలేను. దీనికి అన్నీ పెరిగాయి కాబట్టి ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. అందుకని ఈ సినిమాని స్వామిరారాతో కంపేర్ చెయ్యలేను.
మీరనుకున్న క్యారెక్టర్‌కి నాగచైతన్య ఎంతవరకు యాప్ట్ అయ్యాడు?
హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయ్యాడు. చైతు హీరో అనుకున్న తర్వాత అతని బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కొన్ని సీన్స్ రాసుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో ఆ ఔట్‌పుట్ హండ్రెడ్ పర్సెంట్ చైతు నుంచి వచ్చింది.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి సపోర్ట్ ఎలా వుంది?
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళబ్బాయి, నేను క్లోజ్ ఫ్రెండ్స్. రెండో సినిమా వారికే చేద్దామనుకున్నాను. ప్రసాద్‌గారి గురించి తెలిసిందే. అన్నీ భారీ చిత్రాలు తీస్తారు. ఈ సినిమాకి సంబంధించి ఇంతలో సినిమా తియ్యి అని ఏరోజూ నాతో చెప్పలేదు. నీకు ఎలాంటి టెక్నీషియన్స్ కావాలన్నా తీసుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే నేను పెట్టుకొన్ని టెక్నీషియన్స్ కూడా నాకు కావాల్సిన ఔట్‌పుట్ ఇచ్చారు. నిర్మాత సపోర్ట్ వుండడంవల్లే నాకు కావాల్సినవి తీసుకొని చెయ్యగలిగాను. పీటర్ హెయిన్ కూడా చిన్న సినిమాలంటే చెయ్యడు. ప్రసాద్‌గారు పీటర్ హెయిన్‌ని తీసుకొస్తానన్నారు. అతని డేట్స్ కోసం రెండు మూడు నెలలు ఆగి ఆ ఛేజ్ సీన్ తీశాం. ప్రసాద్‌గారు లేకపోతే పీటర్ హెయిన్ అనే ఆప్షన్ నాకు వుండేది కాదు.
ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది, నాకు చాలా బాగా నచ్చింది, చివరి అరగంట హిలేరియస్‌గా వుందని రవితేజగారు అప్రిషియేట్ చేసారు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్?
నేనే ఇంకా ఏమీ అనుకోలేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించి అలా వెళ్తాను. అయితే ఫ్యూచర్‌లో ఒక పిరియాడిక్ మూవీ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్ సుధీర్‌వర్మ.