జగన్ జైలులో.. షర్మిల పాదయాత్రలో.. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు జూపుడి ప్రభాకర్‌రావు మంచి ఫాంలో ఉన్నారు. ఆ పార్టీకి మీడియా ఎదుట(మాత్రమే) అన్ని తానై జూపుడి మైకులను నమిలిపారేసేవాడు. జగన్ అంతటి వాడు లేదని, అతడో పెద్ద త్యాగమూర్తి అని, పేదల సంక్షేమం కోసమే ఆయన జైలుకు వెళ్లాడని, చంద్రబాబు తెలుగు ప్రజలకు ఓ శని అంటూ ఉపన్యాసాలు దంచేసి వదిలిపెట్టేవాడు. ఇక రాజకీయాల్లో కూడా తాను ప్రత్యేకమని, మచ్చ అంటని మహాత్ముడనన్నట్టు సాగేవి ఆయన వ్యవహారాలు. ఇదంతా ఎన్నికలకు ముందు సీన్. ఎన్నికలు అయిపోగానే కొత్త జూపుడి కనిపించాడు. జగన్ ఓ నియంత అంటూ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక తాను ఏ పార్టీలో కూడా చేరనని చెప్పిన జూపుడి.. నెలల వ్యవధిలోనే బాబను వేన్నోళ్ల పొగుడుతూ ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. దీంతో ఆయనకు టీడీపీలో బెర్త్ దొరికింది. ఆ తర్వాత పార్టీ అధికార ప్రతినిధి హోదా దొరకగానే చిన్నబాబును పొగడటం మొదలుపెట్టాడు. నవ్యాంధ్రకు నారా లోకేష్ అవసరం ఉందని, వెంటనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తెగ ప్రార్థిస్తున్నాడు జూపుడి. అంతటితో వదలిపెట్టకుండా జగన్.. జనం తిరస్కరించిన నాయకుడని.. లోకేష్ పరిపక్వతగల మనిషని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ మాటలకు ఎప్పటికీ జూపుడి కట్టుబడి ఉంటారా..? లేక 2019 ఎన్నికల్లో ఈ మాటల అర్థం మార్చేస్తారా అన్నది అర్థంకాకుండా ఉంది.