నేపాల్‌ను భూకంపం రాకాసి అతలాకుతలం చేసింది. గంటగంటకూ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పేద దేశమైన నేపాల్‌ను భూకంపం దారుణంగా దెబ్బతీసింది. ఈ ఘోరకలినుంచి నేపాల్ తేరుకోవడానికి కనీసం మరో 30 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. సోమవారం నాటికి 1500 మృతదేహాలను వెలికి తీసిన నేపాల్ రక్షణ సిబ్బంది మంగళవారం మరో వెయ్యి మృతదేహాలను వెలికితీశారు. ఇక మంచుపర్వతాల్లో, కుప్పకూలిన ఇళ్లల్లో అనేక మంది ఇరుక్కుపోయారని, మృతుల సంఖ్య ఊహకు కూడా అందనంత మొత్తంలో ఉందని అక్కడ ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో ఈ భూకంపంతో పవిత్రమైన ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయి. భౌద్ధుల పవిత్రస్థలాలు, యూనెస్కో గుర్తించిన అనేక చారిత్రాత్మక కట్టడాలను భూకంపం శిథిలం చేసింది. ఇక రవాణ, విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు కూడా సోమవారం రాత్రి ఓ టెంటులోనే తలదాచుకున్నట్లు సమాచారం. 150 ఏళ్ల కింద నిర్మించిన అధ్యక్ష భవనానికి భూకంపంతో పగుళ్లు రావడంతో అధ్యక్షుణ్ని ఓ టెంటులోకి మార్చినట్లు తెలిసింది. ఇక భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా నేపాల్‌కు చేయూతనందించడానికి ముందుకువస్తున్నాయి. నేపాల్‌లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్రం 4 ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించింది.