అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైసీపీ నాయకుడు హరిప్రసాద్ హత్యతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఈ హత్యలో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ హత్యను నిరోధించలేకపోయిన పోలీసులు నిందితులను మాత్రం ఒక్కరోజు వ్యవధిలోనే అరెస్టు చేశారు. మృతుడి ఫిర్యాదు మేరకు మొత్తం 13మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేశారు. అంతేకాకుండా అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే ఇది రాజకీయ హత్య కాదని, ప్రతీకార హత్యఅని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రకటించారు. 2003లో జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని కూడా ఆయన చెప్పారు. అయితే నిందితులను పూర్తిగా విచారించకుండానే పోలీసులు ఈ ప్రకనట చేయడం అనుమానాలకు తావిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసులును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు హత్యసమయంలో అక్కడే ఉన్న ఆర్‌ఐ, తహసీల్దార్‌లను కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. దీంతో ఈ హత్యలో ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ తహసీల్దార్ స్థాయి వ్యక్తి హత్యకు సహకరించి ఉంటే ఆయనపై ఏస్థాయినుంచి ఒత్తిడి ఉండి ఉంటోందనన్న అనుమానాలున్నాయి. ఇక ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేసిన నిందితులంతా కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.