హైటెక్స్ : జనసేన ఆవిర్భావ సభలో పవరు స్టార్ పవన్ కళ్యాణ్ తమ ప్రసంగంలో ఇలా అన్నారు -
నేను ఓ తెలంగాణ మిత్రుడిని అడిగాను. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందుకు ఉద్యమిస్తున్నావు అని. అతను చెప్పాడు- నేనో చిన్న ఉద్యోగిని. నా జీవితాశయం మా ఊళ్ళో ఓ చిన్న స్ధలం కొని ఇల్లు కట్టుకోవాలని. పెళ్ళి జేసుకుని హాయిగా సొంతింట్లో బతకాలని. ఆ ఆశతో కష్టపడి సంపాదించి డబ్బు పోగుజేశాను. పదివేలయింది. అదీ నా స్ధలం ఖరీదు. కానీ ఆంధ్రావాళ్ళు వచ్చి మా భూములు ఎకరాలుగా కొనేశారు. మా కళ్ళెదుటే ప్లాట్లు వేశారు. వేలు ఖరీదుచేసే స్థలం లక్షలు అయింది. వారు డబ్బు చేసుకున్నారు. కానీ నా జీవిత కాలంలో ఓ ప్లాటు కొనలేను, ఇల్లు కట్టలేను. మా తెలంగాణ భూముల్ని ఆంధ్రావాళ్ళు లక్షలకు కొని మా కళ్ళెదుటే కోట్లకి అమ్ముతున్నారు. నాలాంటి వారికి పుట్టి పెరిగిన గడ్డపై తలదాచుకోవడానికి స్ధలం దొరకని పరిస్థితి. అందుకే ఆంధ్రా దళారులంటే నాకు కోపం. అందుకే ఉద్యమిస్తున్నా.
‘‘ఆ తెలంగాణ సోదరుడి ఆవేదనను అర్ధం జేసుకున్నాను. అతడి పోరాటాన్ని సమర్ధిస్తున్నాను.’’ అన్న పవర్ స్టార్ గారూ, ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రాలోనూ దాపురించింది. సామాన్యుడు స్థలం కొనలేని పరిస్థితి. రాజధాని స్ధల ఎంపికకు ముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది ఎకరాలు కొన్నదెవరో మీ పవన్‌సేన బయటపెట్టగలదా? రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందిక్కడ. బినామీల పేరుతో వందల ఎకరాలు కొనేశారు. సామాన్యుడు ఇళ్ళ స్ధలం కొనే పరిస్ధితి లేదు. దీనిపై స్పందించండి సారూ...