రజనీకాంత్, పవన్‌కళ్యాణ్, శివాజీ విలక్షణమన వ్యక్తులు. భేషజాలు లేనివారు. ఎవర్నీ ఖాతరు చేయరు. వారు నమ్మిందే చేస్తారు. పబ్లిక్ గార్డెన్‌లోని సిమెంటు బెంచీమీద, మామిడిచెట్టు నీడన నులకమంచం మీద పడకనూ ఆస్వాదించగల అభినవ రుషులు. మోదీ భావజాలానికి ప్రభావితుడైన శివాజీ తిరుపతి వెంకన్నను, మోదీని ఆరాధించాడు. టివి ఛానల్స్‌లో జరిగే ముఖాముఖి చర్చలలో పాల్గొన్న శివాజీ ఆయా అంశాలపై ‘బిజెపి లైన్ ఆఫ్ థాట్’ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో శివాజీ స్టేట్‌మెంట్స్ బిజెపిని ఇరుకున పెట్టిన విషయం వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా అన్నది వెంకయ్యనాయుడు విశ్వసనీయతకు, మోదీ వ్యక్తిత్వానికి పెద్ద సవాలు. బీహారు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా విషయాన్ని బిజెపి పక్కన పెడుతుంది. బిజెపి నాయకులెవరూ శివాజీని కూర్చోబెట్టి పిచ్చాపాటీగా రాజకీయ ఎత్తుగడలని వివరిస్తే బాగుండేది. పైపెచ్చు శివాజీకి బిజెపి పార్టీ సభ్యత్వం లేదని పురంధేశ్వరి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు నిరాహార దీక్షకు దిగిన శివాజీకి మద్దతు పెరుగుతోంది. ఇదే సయమంలో రాజధానికి భూసేకరణ విషయమై రైతులు అడ్డం తిరుగుతున్నారు. రైతులకి అండగా పవన్ కళ్యాణ్ రాకుంటే పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా పెద్ద మైనస్ అవుతుంది. ‘నానో’ ఫ్యాక్టరీ భూ విషయమై పశ్చిమబెంగాల్‌లో సిపిఎం పార్టీ ఎదుర్కొన్న పరిస్థితే ఆంధ్రాలోనూ పునరావృతమవుతుంది. వామనుడిలా రాజకీయరంగ ప్రవేశం చేసిన శివాజీ విశ్వరూపాన్ని ధరించే ప్రమాదం బిజెపి - టిడిపిని సమీపిస్తోంది. శివాజీని కాదనుకున్న బిజెపి మూల్యం చెల్లించక తప్పదు.