‘డ్రిరక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్’ కేసులో న్యాయస్ధానం అయిదేళ్ళ శిక్షను విధించింది. కానీ రెండు జన్మల కాలానికి సరిపడా పెద్ద శిక్షను విధించారు ప్రజలు, సినీ జనాలు, ఆయన కుటుంబ సభ్యులు. తనకి అయిదేళ్ళ జైలు శిక్ష - అంటే జీవితకాలంలో అయిదేళ్ళు వృధా. న్యాయస్ధానం విధించిన శిక్ష ఔచిత్యాన్ని ప్రశ్నించడం లేదెవరూ. సల్మాన్‌ఖాన్ జీవితంలో అయిదేళ్ళు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాడన్న బాధ సినీ అభిమానులలో, సినీ పరిశ్రమలో పెల్లుబికింది. తన కోసం కన్నీరు కార్చుతున్న వారిని చూసి సల్మాన్ ఎంతగా కుమిలిపోయివుంటాడో, తన వలన నష్టపోయిన వారిని గుర్తుచేసుకుని ఎంతగా బాధపడివుంటాడో ఊహించవచ్చు.
ఆ రాత్రి ఏం జరిగిందో సల్మాన్‌కి తెలుసు. సల్మాన్‌ని అభిమానించే వారికీ తెలుసు. పరిశ్రమలోని తోటి వారికీ తెలుసు. అయినా వారంతా తనకోసం కన్నీరు కార్చడాన్నిమించిన శిక్ష వేరొకటి ఏముంటుంది సల్మాన్‌కి, వారి ప్రేమను, విశ్వాసాన్ని, గౌరవాన్ని కాపాడుకోలేకపోయానన్న బాధ - వారికి దగ్గర కావాలని, వారి ప్రేమను పెంచుకోవాలన్న తపన సల్మాన్‌లో కనిపిస్తోంది. కత్తిలేకుండా రక్తం చిందకుండా సల్మాన్ గుండెకు గాయం చేశారు. కన్నీటికి, ప్రేమకు వున్న శక్తి అదే.