జయలలిత అక్రమాస్తులకేసు 19 ఏళ్ళు సాగి సాగి ఓ కొలిక్కి వచ్చింది. వేల కోట్లు, లక్షల కోట్లలో జరిగిన స్కాంల వివరాలు చూసిన సగటు భారతీయుడు దాసరిపై వచ్చిన రెండు కోట్ల అవినీతి ఆరోపణ, జయలలితపై వచ్చిన అక్రమాస్తుల వివరాలు చూసి - ఇవీ అక్రమాలేనా? అని చప్పరిస్తున్నాడు. ఈ ఇద్దరిలో దాసరిది మరీ దారుణం. తెలుగు సినిమా నిర్మణ వ్యయం 100 కోట్లను చేరిన నేపధ్యంలో దర్శకుని పారితోషికం కోట్లు పలుకుతోంది. దాసరిపై వచ్చిన రెండు కోట్ల ఆరోపణను చూసి ఓ పాత్రికేయుని వ్యాఖ్య ‘‘ఈ విషయమై నిజ నిర్ధారణకు ఎన్నికోట్లు ఖర్చవుతాయో’’.
అలాగే జయలలిత కేసు. ఈ ఆరోపణలు చేసింది డిఎంకె అధిష్టానం, బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. జయలలిత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల డిఎంకె నాయకులపై వచ్చిన వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల వలన ప్రజలలో జయలలిత పట్ల సానుభూతి ఏర్పడిరది. కోర్టు తీర్పుపై డిఎంకె కరుణానిధి స్పందించి తమిళ ప్రజల దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు, జయలలిత సానుభూతిపరుల ఆగ్రహానికి గురయ్యారు. ఇదే సమయంలో అసలు పిటీషనర్ సుబ్రహ్మణ్యస్వామి అప్పీలుకి వెళ్తానని ప్రకటించారు. బిజెపి అధినాయకత్వం సుబ్రహ్మణ్య స్వామిని నిలువరించకపోతే జయలలిత అభిమానుల ఆగ్రహాన్ని బిజెపి రుచి చూడాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఈ తరం మేధావులలో ఒకరు. ఏ చైనాలోనో దౌత్యవేత్తగా వుండవలసిన మేధావి. చూద్దాం, తమిళనాడు రాజకీయాలు ఏ నిమిషాన ఎలా మారుతాయో...?