ఏపీలో ఎన్ని పార్టీలున్నా.. విభజనకు ముందు మాత్రం కేవలం రెండు వర్గాలే కనిపించాయి. కొట్టుకోవడానికి పార్టీలకతీతంగా నాయకులంతా ఏకమయ్యారు. తెలంగాణ నాయకులు.. సీమాంధ్ర నాయకులంటూ రెండు వర్గాలుగా విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక పక్షం.. సమైక్యాంధ్ర కోసం మరో పక్షం ఆందోళనలు చేశాయి. అయితే రాష్ట్రం విడిపోయి ఎన్నికల తంతు ముగియగానే మళ్లీ ప్రాంతీయ బేధం లేకుండా కలిసి మెలిసి తిరుగుతున్నారు. అయితే ఈ సంప్రదాయాన్ని కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పార్టీకి చెందిన తెలంగాణ, సీమాంధ్ర నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం విస్మయం కలిగిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సొంత రాష్ట్ర వ్యవహారాలను విడిచిపోట్టి గుత్తా ఏపీ విషయంలో తలదూర్చడం బాగాలేదని పరుషపదజాలంతో హెచ్చరించారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయన్నది గుత్తా వాదన. అలాంటప్పుడు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయాలేగాని ఇలా పక్క రాష్ట్రంపై పడటం సబబు కాదని టీ-కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం ఎలా ఉందంటే తనకు తిండి లేకున్నా.. సరేగాని అవతలివాడికి నీరు కూడా దొరకకుండా చేయాలని దేవుణ్ని ప్రార్థించినట్లు కనిపిస్తోంది.