తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు జరుగుతున్న ఆరుస్థానాలకు ఆయా పార్టీల బలబటాలనుబట్టి చూస్తే.. టీఆర్‌ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఒక స్థానంలో సులభంగా గెలుపొందే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదుస్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. లేకపోతే ఎన్నికలు అవసరం లేకుండానే ఎమ్మెల్సీల ఎంపిక ఏకగ్రీవమయ్యేది. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాంటే 20 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా కావాలి. టీఆర్‌ఎస్‌కు నాలుగు స్థానాల్లో గెలుపొందడానికి అవసరమైన సంఖ్యకు మించి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. ఇక తన మిత్రపక్షం ఎంఐఎంకు ఉన్న ఏడుమందిని కలుపుకుంటే ఈ సంఖ్య పదికి చేరుకుంటుంది. అటు తర్వాత వామపక్షాలు, ఇండిపెండెంట్లను కలుపుకొని టీడీపీలో మిగిలిన వారికి కూడా గాలంవేస్తే ఐదో ఎమ్మెల్సీని కూడా గెలుచుకోవచ్చనే ఆశాభావంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది. మరోవైపు తమకు పదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నా.. ఇప్పటికే వారిలో కొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని ఊగిసలాటలో ఉన్న మరికొందరికి కూడా భారీ నజరానాలు ప్రకటించి 'కారు' ఎక్కించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ ఈ ఎన్నికలకు సంబంధించి విప్ జారిచేస్తే పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అప్పుడు టీడీపీనుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు సస్పెండ్ కావాల్సి వస్తుంది. ఇది జంప్ జిలానీలకు కలిసొచ్చే అంశమే. ఒకవేళ విప్ జారీ చేయకపోతే ఎవరికైనా ఓటు వేసుకునే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉంటుంది. అప్పుడు వారు టీడీపీ అభ్యర్థికే ఓటు వేస్తారని కూడా కచ్చితంగా చెప్పలేం. ఈ ఎన్నికలు టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.