పదేళ్లుగా తెలంగాణ పోరాటంలో కేసీఆర్ వెన్నంటినడిచిన వారికి ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కడం లేదా..? పదవుల్లో జంప్ జిలానీలకే ప్రాధాన్యతనిస్తున్నారా..? ఇన్నాళ్లు తనను విమర్శించిన వారినే కేసీఆర్ అందలమెక్కిస్తున్నారా..? అనే అనుమానాలు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల్లో కొనసాగుతున్నాయి. మొదటినుంచి పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారికి కాకుండా కేసీఆర్ జంప్ జిలానీలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారంటూ గులాబిదళం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీకి గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కమిటీల్లో ప్రధాన పోస్టులను టీడీపీ, కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకులకే ఇవ్వడం తీవ్ర వివాదాలకు దారితీసింది. ఇక ఈ సమస్య సద్దుమణిగిందనుకునేలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఐదుగురు కూడా ఇతర పార్టీల నాయకులే కావడం గమనార్హం. నిన్నమొన్నటి వరకు టీడీపీలో ఉండి తనను తీవ్రంగా విమర్శించిన తుమ్మల నాగేశ్వర్‌ను మంత్రి చేయడంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడంపై ఆపార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక మిగిలిన నలుగురు విషయానికొస్తే కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవరెడ్డిలు. వీరంతా కూడా కాంగ్రెస్, టీడీపీలనుంచి వచ్చిన వారే. పార్టీలో ఎవరూ లేనప్పటినుంచి కేసీఆర్‌కు అండగా ఉంటూ ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన తమను కాదని, ఇతర పార్టీల నాయకులకు కేసీఆర్ పదవులు అప్పగించడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా కేసీఆర్‌కు చెప్పే ధైర్యం లేక వారు సతమతమవుతున్నారు.