టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు షాకినిచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అనురాధను ఎంపికచేయనున్నట్లు బాబు సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. అయితే ఎమ్మెల్యే కోటాలో పోటీకి పేరు ప్రకటించిన జూపూడి కృష్ణారావుకు చివరి నిమిషంలో ఆటంకం ఎదురైంది. ఆయనకు ఏపీలో ఓటు హక్కు లేకపోవడంతో పోటీకి అర్హత కోల్పోయారు. ఆ స్థానంలో ఎమ్మెల్సీగా అనురాధను పోటీచేయాల్సిందిగా బాబు సూచించారు. అయితే ఎమ్మెల్యే కోటాలో పోటీచేస్తే ఆ పదవీ కాలం మరో రెండేళ్లే ఉందంటూ అనురాధ నామినేషన్ వేయడానికి తిరస్కరించి ఆరేళ్ల పదవీ కాలం ఉన్న గవర్నర్ కోటాలోనే తనను ఎమ్మెల్సీ చేయాలని స్పష్టం చేశారు.
అయితే ఈ విషయమై ఆగ్రహానికి గురైన చంద్రబాబు గవర్నర్ కోటాలో కూడా అనురాధకు సీటు ఇవ్వకుండా షాకిచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీనుంచి నలుగురు ఎంపికవనున్నారు. ఆ లిస్టులోంచి అనురాధ పేరు తొలగించినట్లు సమాచారం. ఆమె స్థానంలో రవిచంద్రయాదవ్‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మూడు స్థానాలకు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాసు, టీడీ జనార్దన్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఇదే లిస్టు ఫైనల్ అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. పాపం.. అనురాధ ఆరేళ్ల ఎమ్మెల్సీని ఆశపడితే బాబు రెండేళ్ల ఎమ్మెల్సీ పదవి కూడా ఆమెకు ఇవ్వకపోవడం బాధకరమే.