ఆంధ్రప్రదేశ్ విభజనతో టీడీపీ జాతీయ పార్టీగా అవతరించనుందని చంద్రబాబు ప్రకటించారు. అయితే చంద్రబాబు కోరిక అంత సులభంగా నెరవేరేలా కనబడటం లేదు. టీడీపీ జాతీయపార్టీగా అవతరించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని బాబు ఓ కమిటీ కూడా వేశాడు. అందులో యనమల, కేశవ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. అయితే టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నికవడానికి ప్రధానంగా రెండు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అందులో మొదటిది పార్టీ పేరు. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితమవుతుంది. ఈ పేరుతో తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో టీడీపీ పోటీ చేయడం అంత అనుకూలంగా ఉండదు. గతంలో ఎన్‌టీఆర్ భారతదేశం పార్టీ అనే పేరుతో ఓ జాతీయ పార్టీని స్థాపించాలని చూశారు. పలు కారణాలరీత్యా అది ఆలోచనలను దాటి కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించడానికి తెలుగు దేశం పేరు మారుస్తామంటే ఆ పార్టీ కార్యకర్తలే ఒప్పుకునే అవకాశాలు ఉండవు.
ఇక రెండో సమస్యకు వస్తే ఆ పార్టీ గుర్తు. టీడీపీకి ఉన్న సైకిల్ గుర్తు సమాజ్‌వాది పార్టీకి కూడా ఉంది. జాతీయ పార్టీకి కేటాయించిన సింబల్ మరే పార్టీకి కూడా ఉండటానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో జాతీయపార్టీగా వెళ్లాలంటే పార్టీ గుర్తు మార్చకతప్పని పరిస్థితి. అయితే కొత్త గుర్తుతో మళ్లీ ఎన్నికలకు వెళ్లడం కత్తిమీద సాములాంటిదే. ఈ రెండు సమస్యల దృష్ట్యా టీడీపీ జాతీయ పార్టీగా అవతరించే అవకాశాలు లేనట్లేననే వాదన వినిపిస్తోంఇ.