టీీడీపీ మహానాడుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో మహానాడును ఓ పండుగలా చేయాలని తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి మహానాడును ఓ వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇక ఈ అంచనాలకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయి. పసుపు జెండాలు, బాబు, లోకేష్, ఎన్టీఆర్‌ల కటౌట్లతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారింది. అయితే ఈ మహానాడులో లోకేష్‌బాబుకు మరిన్ని పార్టీ బాధ్యతలు అప్పగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహానాడుకు ముందుగానే టీడీపీ నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులను నిర్వహించింది. ఇక్కడ కార్యకర్తలనుంచి లోకేష్‌బాబుకు మరిన్ని క్రీయాశీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ప్రస్తుతం లోకేష్‌బాబు పార్టీ కార్యకర్తల సమన్వయ నిధి కన్వీనర్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవలే అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన ఏపీకి పెట్టుబడులు తెప్పించడానికి బాగానే ప్రయత్నించాడు. ఇక లోకేష్‌కు పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడానికి ఇదే మంచి తరుణమన్న వాదనలు తెలుగు తమ్ముళ్లలో వినిపిస్తున్నాయి. ఈ మేరకు మహానాడులో ఓ నిర్ణయం వెలువడవచ్చని వారు భావిస్తున్నారు. ఈనెల 27నుంచి టీడీపీ మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే.