కనుమరుగైన ఆడియో కంపెనీలు
పల్లె జీవుల శ్రమలో నుండి పుట్టిన పాట ఆ నోటా ఈ నోటా ప్రయాణించేది.. మానవుడు తాను అభివృద్ధి చెందుతూ తనకు కావలసిన వాటిని కూడా అభివృద్ది చేసే క్రమంలో శబ్దాన్ని రికార్డు చేసే ప్రక్రియను కనుగొన్నాడు.. దాని తరువాత పాట శబ్దమయి రికార్డు కాబడింది .. అప్పటి వరకు ఒక నోటి నుండి మరో నోటికి ప్రయానిస్తున్న పాట రికార్డు కాబడి .. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినే సదుపాయం అయింది. ముందుగా ఎల్.పి రికార్డుగా పాటలు వచ్చేవి.. ఆ ప్రక్రియ అప్పటి తరం వారికి వింతగానూ కొత్త గానూ అనిపించేది. తదనంతరం యల్.పి.రికార్డులు పోయి ఆడియో టేపులో ఇమిడి పోయింది.. కొన్ని దశాబ్దాలు ఆడియో టేపుల్లో ప్రయాణించిన పాట తన గతిని మార్చుకుని తరువాత సీడిల్లోకి దూరి పోయింది. సీడిల్లోకి ఎంత వేగంగా దూరిందో అంతే వేగంగా మెమరీ కార్డు పెన్ డ్రైవ్ లలో ఇమిడి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ లేకుండా క్లౌడ్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ అందరూ వినే విధంగా దొరుకుతోంది.
ముందు యల్ పి.రికార్డుల కంపెనీ ప్రారంభమై ఎంతో మందికి ఉపాది కల్పించిన ఆడియో రంగం తరువాత ఆడియో కేసెట్లు రావడంతో అది ఒక పరిశ్రమగా వేళ్లూనుకుంది. ఎన్నో ఆడియో కంపెనీలు వెలిశాయి.. సినిమా పాటలతో పాటు భక్తిగీతాలు .. జాన పద గీతాలు .. ఇలా ఎన్నో రకాలు గా ఆడియో కేసెట్ లు విపరీతంగా చేసేవారు. దాంతో అది ఒక పరిశ్రమగా ఏర్పడింది. సినిమా తీసిన నిర్మాతలకు ఆడియో అనేది ఒక అదనపు ఆదాయంగా మారింది. ఎల్.పి లకంటే ఆడియో కేసెట్ లు ఎక్కువ కాలం మనగలిగాయి .. ఒక రకంగా చెప్పు కోవాలంటే ఆడియో ది మలిదశ .. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆడియో కేసెట్ తరువాత సి.డిలు వచ్చినా అవి ఎక్కువ కాలం మనలేదు అని చెప్పాలి.. ఆడియో కేసెట్లు .. దాని తరువాత సీడిలు ఆ రెండు ప్రక్రియలు ఉన్నప్పుడు అనేక కంపెనీలు పెద్ద పెద్ద మాల్స్ లాగా పెట్టేవారు.. సీడి ప్రక్రియ తరువాత ఆడియో కంపెనీలకు గడ్డు కాలం వచ్చింది. ఆన్ లైన్ పుణ్యమా అని సినిమా ఆడియోను సిడి రూపంలో కొనే వారు కరువయ్యారు దాంతో అనేక ఆడియో కంపెనీలు మూత పడ్డాయి.. పాట ను నమ్ముకున్న ఆడియో పరిశ్రమలు మూత పడ్డాయి. ప్రస్తుతం సినిమా ఆడియో గాని మరే ఆడియో గాని శాటిలైట్ ద్వారా నేరుగా వినే అవకాశం కలుగుతోంది.. పాట పుట్టినపుడు ఎలా ఒకరి నోటినుండి ఒకరి నోటికి ప్రయాణం చేసిందో అదే రీతిలో ఇప్పుడు శబ్దతరంగాల ద్వారా ప్రయాణం చేస్తోంది. సాంకేతిక అభివృద్దితో మేలుతో పాటు కీడు కూడా జరుగుతుంది అనేది ఈ ఆడియో పరిశ్రమను గమనిస్తే తెలుస్తుంది.
-పర్వతనేని రాంబాబు