వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించడానికి తెలంగాణలో మరోసారి ఆమె యాత్ర చేపట్టనున్నారు. నల్లగొండలో షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ఈనెల 9 నుంచి నల్గొండ జిల్లాలో ప్రారంభంకానుంది. షర్మిల నాలుగో రోజులపాటు నల్గొండ జిల్లాలో పర్యటించి మొత్తం 17 కుటుంబాలను పరామర్శించనున్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఇక చెల్లి షర్మిలకు తెలంగాణ బాధ్యతలను ఆయన అనధికారికంగా అప్పగించారు. ఇక తెలంగాణలో ఇప్పటికే వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇక్కడ ఆ పార్టీ ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె పార్టీలో తిరిగి జవసత్వాలు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో మొదటిసారి ఆమె చేపట్టిన పరామర్శ యాత్రకు ప్రజలనుంచి స్పందన కరువైంది. దీంతో ఈసారి యాత్రను విజయవంతం చేయడానికి ఆ పార్టీ ప్రధాన నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.