దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడే మ్యాగీ నూడుల్స్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. మొదట ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్‌కి పంపించారు. అందులో సీసం ఎక్కువగా వుందని, దానివల్ల ఒక్కోసారి ప్రాణహాని కూడా జరిగే అవకాశం వుందని తేలడంతో కొన్ని ప్రాంతాల్లో మ్యాగీ నూడుల్స్‌ని నిషేధించారు. హైదరాబాద్‌లోని ఓ న్యాయవాది దీనికి సంబంధించి వేసిన కేసును పరిశీలనలోకి తీసుకుంటూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి శాంపుల్స్‌ని సేకరించి పరీక్షకు పంపించారు. ఇలా దేశవ్యాప్తంగా మ్యాగీ మీద దుమారం చెలరేగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్‌ను రోడ్డు మీద వేసి తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడం విశేషం. ఇదిలా వుంటే మ్యాగీ నూడుల్స్‌ని తినమని, ఎంతో ఆరోగ్యమని, రుచికరమని రకరకాల మాటలు చెప్పి ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసిన బాలీవుడ్ స్టార్స్‌పై కూడా కేసులు పెట్టాలని మానవ హక్కుల సంఘం కోరుతోంది. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటా ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసినవారిలో వున్నారు.
మ్యాగీకి సంబంధించిన యాడ్స్‌లో గతంలో నటించానని, ఇప్పుడు ఆ ప్రొడక్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమితాబ్ చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సహకరిస్తానని అన్నాడు. ప్రీతి జింటా మాత్రం 12 ఏళ్ళ క్రితం మ్యాగీ నూడుల్స్ ప్రకటనల్లో కనిపించానని, ఆ కారణంగా ఇప్పుడు నన్ను బయటికి లాగడం సమంజసం కాదని వాదిస్తోంది. అయితే ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసేందుకు ఆయా ప్రకటనల్లో నటించిన ఈ బాలీవుడ్ స్టార్స్‌పై కేసులు పెడతారా? అనేది ఇంకా తేలాల్సి వుంది. మ్యాగీ నూడుల్స్‌ని తయారు చేస్తున్న నెస్‌లే కంపెనీ మాత్రం ఈ ప్రొడక్ట్‌కి ఇప్పటివరకు కొన్ని వేలసార్లు పరీక్షలు నిర్వహించామని, అందులో అనారోగ్యానికి గురిచేసే ఎలాంటి కెమికల్స్ లేవని చెప్తోంది. ఏది ఏమైనా మ్యాగీ నూడుల్స్ వల్ల అంటుకున్న మంట తాలూకు సెగ మాత్రం బాలీవుడ్ స్టార్స్‌కి కూడా సోకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది.