ఏపీ రాజధాని అమరావతికి శుక్రవారం భూమి పూజ జరిగింది. ప్రధానిసహా కేంద్రమంత్రులంతా ఈ శంఖుస్థాపనకు హాజరవుతారని మొదట ప్రకటించినా.. వారెవరూ లేకుండానే కార్యక్రమాన్ని కానిచ్చారు చంద్రబాబు. ఇక కేంద్రం సంగతి పక్కనపెడితే.. చివరకు పవన్ కల్యాణ్ కూడా ఇక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
ఏపీకి జరిగిన అన్యాయంతో మనస్తాపానికి గురైన తాను జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు పలుమార్లు ప్రకటించాడు. అంతేకాకుండా చంద్రబాబు వంటి నాయకుడు మాత్రమే ఓ రాజధానిని నిర్మించగలడని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పి టీడీపీ తరఫున ప్రచారం చేశాడు. చివరకు ఆ రాజధాని భూమి పూజలో పవన్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజధానికి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రాని రైతులపై ప్రభుత్వం భూసేకరణ చట్టం ఉపయోగించి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తోంది. దీన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు, పవన్‌ల మధ్య విభేదాలొచ్చాయని, అందుకే భూమి పూజకు పవన్‌ను ఆహ్వానించలేదని సమాచారం. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా పోరాడుతానని చెప్పి.. ఇప్పుడు భూమి పూజకు హాజరవుతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయనే పవన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదనే వాదనలు కూడా వినబుతున్నాయి.