అందరూ ఊహించినట్టుగానే బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన భార్య బొత్స ఝాన్సీ, మాజీ ఎమ్మెల్యేలు అప్పల నర్సయ్య, అప్పల నాయుడుతో కలిసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అయితే బొత్స చేరికను పలువురు వైసీపీ నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయినా జగన్ మాత్రం బొత్స చేరికను వదిలిపెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్ట పడలేదు. అసమ్మతి నాయకులతో జగన్ స్వయంగా మాట్లాడి నచ్చజెప్పారు.
అయితే బొత్స చేరిక వైసీపీకి బలాన్ని చేకూరుస్తుందని చెప్పడానికి ఎలాంటి అనుమానం అక్కరలేదు. అదే సమయంలో బొత్స చేరికను వ్యతిరేకిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. వైసీపీలోనే కొనసాగాలా లేక వేరే దారి చూసుకోవాలా.. ? అన్న మీమాంసలో వారున్నట్లు తెలుస్తోంది. స్వయంగా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించినా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ బొత్స చేరిక కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆయన ఇప్పటికే టీడీపీ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బొత్స ఉన్న పార్టీలో తాను ఉండనంటూ సుజయ్ టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వైసీపీ నాయకులు సాంబశివరాజు, కొలగట్ల వీరభద్రస్వామి జగన్ బుజ్జగింపులతో కాస్త కిందకు దిగివచ్చి బొత్స చేరిక కార్యక్రమానికి హాజరైన లోలోన వారు కూడా తీవ్ర అసమ్మతితో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా టీడీపీ నుంచి పిలుపు వస్తే ఆలోచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బొత్స కోసం ఇంతమందిని వదులుకోవడానికి సిద్ధమవుతున్న జగన్ పెద్ద రిస్కే చేస్తున్నారని వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.