మొదట్లో రామోజీరావుకు, కేసీఆర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. తెలంగాణ భూములను ఆక్రమించుకొని రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారని, అధికారంలోకి రాగానే లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్‌సిటీని దున్నిస్తానని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ వాయిస్‌లో తేడా వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీలో గంటల తరబడి కాలక్షేపం చేసిన కేసీఆర్ ఫిల్మ్‌సిటీ తెలంగాణకే తలమానికమని ప్రకటించారు. ఇక ఆనాటినుంచి కూడా ఈనాడు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం పూర్తిగా తగ్గించింది. దీంతో రామోజీ, కేసీఆర్‌ల మధ్య సయోధ్య కుదిరిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పుడు మళ్లీ వారిమధ్య బెడిసికొట్టినట్లు తాజా పరిణామాలను గమనిస్తే తెలుస్తోంది.
కేసీఆర్‌కు చెందిన 'నమస్తే తెలంగాణ' బుధవారం 'ఈనాడు'కు వ్యతిరేకంగా మొదటి పేజీలో బ్యానర్ వార్తను ప్రచురించింది. 'ఈనాడా... ఆంధ్రానాడా..?' అంటూ రామోజీరావు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్రకు కొమ్ముకాస్తున్నాడని ఆరోపించింది. ఈ వార్తను చూసి రాజకీయ వర్గాలు నివ్వెరపోయాయి. ఇంత వేగంగా కేసీఆర్ ఆలోచనా ధోరణిలో మార్పు ఎందుకు వచ్చిందంటూ నాయకులు ఆరా తీస్తున్నారు. రామోజీకి, కేసీఆర్‌కు మళ్లీ బెడిసికొట్టినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. మరి వీరి మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి 'ఓటుకు నోటు' స్కాం కారణం కావచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేకపోతే ఫిల్మ్‌సిటీని పొగుడుతూ కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. ఇక వచ్చే ఎమ్మెల్సీ, వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ వ్యూహం మార్చి ఉండవచ్చన్న వాదనలు కూడా ఉన్నాయి.