'ఊహలు గుసగుసలాడే' , 'దిక్కులు చూడకు రామయ్య' , 'లక్ష్మి రావే మా ఇంటికి' వంటి చిత్రాలలో నటించి క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో నాగసౌర్య. ప్రస్తుతం ఆయన నటించిన 'జాదుగాడు' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 26న విడుదల కానుంది. సత్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై వి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చింతకాయల రవి చిత్ర దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో నాగసౌర్య తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక మాస్ ఎంటర్ టైనింగ్ మూవీ. ఈ చిత్రం మాస్, క్లాస్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోసాయి. మూవీ చాలా లౌడ్ గా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఏబిసి సాంగ్ అందరికీ నచ్చుతుంది. జూన్ 26న రిలీజ్ అవబోయే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా సక్సెస్ అయితే సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను.
మీ పాత్ర గురించి చెప్పండి..?
సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ. ఐ ఎస్ డి అనే బ్యాంకు లో రికవరీ ఏజెంట్ గా నటించాను. రికవరీ చేసే ప్రాసెస్ లో ఏం జరుగుతుందనేదే ఈ చిత్ర కథ. సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో ఉన్నట్లుగా కాకుండా కొత్తగా ఉంటుంది.
ఈ సినిమా చేయడానికి కారణం..?
నేను నటించిన సినిమాలు చూస్తే అన్ని సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ మాత్రమే ఎంచుకొని చేసాను. ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినప్పుడు అందరూ కెరీర్ మొదట్లోనే మాస్ మూవీ ఎందుకు చేయడం అని చెప్పారు. కాని సినిమా స్టొరీ నాకు చాలా నచ్చింది. 'జాదుగాడు' అంటే మోసగాడు అని అర్ధం. ఈ స్టొరీ అందరికీ కనెక్ట్ అవుతుంది. క్లాస్, మాస్ అని చూడలేదు మంచి సబ్జెక్టు అని నమ్మి చేసాను. ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని చేయడానికి అంగీకరించాను.
సినిమాలో మీకు నచ్చిన అంశాలేంటి..?
ప్రీ క్లైమాక్స్ మొదలయిన 40 నిమిషాల నుండి సినిమా చాలా బావుంటుంది. సప్తగిరి పాత్ర ఎంటర్ అయినప్పటినుండి చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకులకు త్రిల్ ఫీలింగ్ కలిగిస్తుంది .
డైరెక్టర్ యోగేష్, మీ కో యాక్టర్ గురించి..?
చింతకాయల రవి చిత్రం తరువాత ఆయన డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఆయన సినిమాలలో కామెడీకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా కామెడీ ఉంటుంది. స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేసారు. సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేసారు. ఇక హీరోయిన్ సొనారిక కు తెలుగులో మొదట చిత్రం. పార్వతి అనే రోల్ లో నటించింది.
ఫైట్స్ చేయడానికి ఏమైనా కష్టపడ్డారా..?
మొదట చాలా బయపడ్డాను. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చాలా ఆలోచించాను. కాని డైరెక్టర్ గారు నువ్వు చేయగలవు, ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుందని నన్ను ప్రోత్సహించారు. ఆయన సహకారంతోనే నేను ఫైట్స్ చేయగలిగాను. అలానే నాకు డాన్సులు చేయడం అసలు రాదు. శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్ నాకు చాలా హెల్ప్ చేసారు. ఫైనల్ అవుట్ పుట్ చూసాక నాకే ఆశ్చర్యంగా అనిపించింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
నందిని రెడ్డి గారి డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాను. అది 70% కంప్లీట్ అయింది. అది కాకుండా రమేష్ వర్మ గారి దర్శకత్వంలో శ్యాం కె నాయుడు ఫోటోగ్రఫీలో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను.