తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి పబ్లిసిటీ క్లియరెన్స్ అప్రూవల్ వచ్చింది. ఈ సందర్భంగా టి.ఎఫ్.సి.సి సంస్థ వారు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..
టి.ఎఫ్.సి.సి. అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను స్థాపించి సంవత్సరం కాలం అయింది. ఈ సంస్థను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపు నుండి బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీ ప్రకాష్ జవదేకర్ సెన్సార్, టైటిల్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్స్ ను అప్రూవ్ చేస్తునట్లుగా ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ.పి ఫిలిం ఛాంబర్ లో ఎలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారో అదే విధంగా టి.ఎఫ్.సి.సి లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. చిన్న చిత్రాలకు టాక్సెస్ లేకుండా చూడాలని, సబ్సీడీలను ఇప్పించమని ప్రభుత్వాన్ని కోరనున్నాం. తద్వారా చిన్న నిర్మాతలకు సినిమాలను నిర్మించే అవకాశాలు కల్పించవచ్చు. ఇప్పటికే కెసిఆర్ గారు చలన చిత్ర రంగాన్ని అభివృద్ధి పరచే దిశలో అడుగులు వేస్తున్నారు. ఫిలిం నగర్2 ను స్థాపిస్తామని చెప్పారు. చిత్రపురి లాంటి మరో కాలనీ ను నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. దాని ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించనున్నారు. మా సంస్థలో 500 మంది సభ్యత్వం తీసుకున్నారు. వారందరికీ హెల్త్ కార్డ్స్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆగస్ట్ 15న తమిళ, తెలుగు హీరోల క్రికెట్ ను ఎల్.బి.స్టేడియం లో నిర్వహించనున్నాం. దాని ద్వారా వచ్చే ఫండ్స్ ను పేద కళాకారుల కోసం ఉపయోగించనున్నాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కొడాలి వెంకటేశ్వరావు, సాంబ శివరాజు, సోమిరెడ్డి, అలీ ఖాన్, బెల్లం వేణుమాధవ్, కెవిన్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.