తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపుతీసుకుంటున్నాయి. గతేడాది అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జయలలితన సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతలోనే బెంగళూరు హైకోర్టు ఆమెపై నమోదు చేసిన కేసులను కొట్టివేయడంతో తిరిగి జయలలిత సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ జయలలితకు విరుద్ధంగా జడ్జిమెంట్ వస్తే మళ్లీ ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాని అంతకుముందే ఆమె రాజీనామా చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె అనారోగ్యమే అందుకు కారణమన్న వదంతులు వినిపిస్తున్నాయి.
జూలై 4న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి హాజరైన జయలలిత ఆ తర్వాతనుంచి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకాలేదు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించదని, మధుమేహం, చక్కెరశాతం అధికమై ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన ఓ ట్వీట్ ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఏ క్షణంలోనైనా జయలలిత అమెరికా వెళ్లవచ్చని, అక్కడ ఆమెకు కాలేయమార్పిడి చికిత్స చేస్తారంటూ ఆయన ప్రకటించారు. దీంతో డీఎంకే, కాంగ్రెస్ సహా మిగితా పక్షాలన్ని సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశాయి. ఇక డీఎంకే సభ్యులు ఓ అడుగు ముందుకు వేసి జయలలిత ఆరోగ్యం బాగాలేదని, ఆమె విధులను సక్రమంగా నిర్వర్తించలేరని, సీఎం పీఠంనుంచి దిగాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె సీఎం పదవికి రాజీనామా చేస్తే సీఎం పీఠం ఎవరికి దక్కనుందోనన్న వాదనలు కూడా అప్పుడే ఆ రాష్ట్రంలో మొదలయ్యాయి. మళ్లీ పన్నీర్‌సెల్వంనే జయ సీఎం పీఠంపై ఎక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 10 నెలల కాలంలో ఆ రాష్ట్రానికి మూడుసార్లు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగినట్లు అవుతోంది.