గోదావరి పుష్కరాల్లో జరిగిన విషాద సంఘటన తెలుగు ప్రజల మనసులను కలిచివేస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..?, దీనికి కారణాలేంటి..? బాధ్యులు ఎవరు అన్న విషయాలపై మాత్రం జరగాల్సినంత చర్చ జరగలేదు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ఊహాగాన చిత్రాలు, యానిమేషన్ వీడియోలతో హల్‌చల్ చేసే మీడియా ఈ విషయంలో మాత్రం సరిగ్గా స్పందించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రమాదాన్ని టీడీపీ మీడియా పూర్తిగా పక్కదారి పట్టించింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కార్యక్రమం కావడమూ.. అందునా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరం కావడంతో.. ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని తెలిసినా అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లను చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మృతుల కుటుంబాలు ఘోషిస్తున్నా.. పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. భద్రతా ఏర్పాట్లకు తోడు అధికారపార్టీ హడావుడి కూడా ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
పుష్కరాల ప్రారంభానికి నిర్ణయించిన ముహుర్తం ఉదయం 6.26 గంటలు. ఈ విషయమై మొదటగానే పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రాజమండ్రి ప్రధాన పుష్కరఘాట్ అయిన కోటగుమ్మం మొదటి గేటు వద్దకు వేల సంఖ్యలో జనాలు చేరుకున్నారు. మొదటి రోజు.. అందునా.. పుష్కరాలు ప్రారంభమైన తొలి గంటల్లో స్నానాలు చేస్తే మహాపుణ్యమనే ప్రచారం ఉంది. దీంతో అర్ధరాత్రి నుంచే వేలమంది అక్కడ స్నానాల కోసం వేచిచూస్తున్నారు. ఇక అదే సమయంలో వీఐపీల ఘాట్‌లో కాకుండా సీఎం పుష్కర ఘాట్‌లో స్నానానికి వచ్చారు. అక్కడ దాదాపు రెండు గంటలపాటు గడపడంతో ప్రజలంతా పుష్కర స్నానం కోసం వేచిచేస్తున్నారు. ఇక రెండు గంటల తర్వాత సీఎం, మంత్రులు వెళ్లిపోగానే వారికి రక్షణగా అక్కడ ఉన్న పోలీసులు బలగాలు కూడా వెళ్లిపోయాయి. ఇవేవీ పట్టించుకోని అధికారులు గేట్ల ముందు వేల సంఖ్యలో జనాలు వేచిచూస్తున్నారని తెలిసి కూడా ఒకేసారి ఓపెన్ చేయడంతో జనసందోహం ఒక్కసారిగా ముందుకు కదలింది. దీంతో తోపులాట చోటుచేసుకొని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జన సందోహంలో చిక్కుకున్న వారికి ఎటు వెళ్లాలో అర్థంకాక అక్కడే ఉన్న గోడలు, గేట్లు ఎక్కి కాసింత ఊపిరి పీల్చుకున్నారు.
మరి ప్రమాదం జరిగిన తీరు గురించి కాకుండా.. ఇలాంటి పెద్ద ఉత్సవాల్లో తోపులాట సామాన్యమేనన్న రీతిలో టీడీపీ మీడియా ప్రచారం సాగింది. అంతేకాకుండా ఈ విషాదకర సంఘటన గురించి మరింత ప్రచారం సాగితే.. ఉత్సవాలకు దెబ్బపడుతుందన్న భావంతో ఈ తొక్కిసలాటకు ఆ మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అధికారికంగా మృతుల సంఖ్య 27 అని ప్రభుత్వం చెబుతున్నా.. అది 35 దాటిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.