ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత కూడా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి ఎన్నికల్లో అత్యంత దారుణమైన పరాజయాన్ని కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఉన్నా.. అందులో నాయకులు మాత్రం లేరు. ఇక స్వయంగా ఆ పార్టీని స్థాపించిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మీడియా కంటపడకుండా అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఏ గూటి పక్షికి ఆ గూటికే అన్నట్లు ఆ పార్టీలో చేరిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అన్న వెంటనే తమ్ముడు అంటూ గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన కిషోర్‌కుమార్‌రెడ్డి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదుగాని నల్లారి ఫ్యామిలీ ఏ పార్టీలో కూడా చేరలేదు. ఇక ఇప్పుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో బెర్త్ ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న నల్లారి ఫ్యామిలీ మెంబర్స్‌ను తమ పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. కిషోర్‌కుమార్‌రెడ్డి తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తారేమో..?