ఊహల్లోనే మేడలు కట్టడం.. 3డీ ఎఫెక్ట్‌లో అది చాయచిత్రాల్లో చూపి పత్రికల్లో ప్రకటనలివ్వడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిపాటిగా మారినట్లు విమర్శలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి రాజకీయనాయకులందరూ చేసినా కేసీఆర్ మాత్రం అంతకుమించి.. అని చెప్పవచ్చు. ఇక కేసీఆర్ చర్యలన్ని కొత్తకొత్తగా ఉంటాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆయన గవర్నర్‌కు ఇచ్చిన నివేదిక కూడా కొత్తగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా నిర్వహించలేదని, ప్రజాసమస్యలపై మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే విపక్షాలపై ఫిర్యాదు చేశారు. విపక్షాలు రైతు సమస్యలపై చర్చించకుండా అడ్డుపడ్డాయని, అసెంబ్లీ సమావేశాల్లో తగినంత సమయం కేటాయించినా ప్రజా సమస్యలపై చర్చ సాగకుండా చేశాయని ఆయన ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు గవర్నర్‌తో సమావేశమైన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల గురించి ఆయనకు వివరించారు. అంతేకాకుండా తాను అనుకున్న ప్రాజెక్టుల రూపకల్పన, చాయచిత్రాల ప్రదర్శనను అడ్డుకున్నారని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే మరోసారి తాను ఈ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్న చాయచిత్రాల ప్రదర్శనను అసెంబ్లీ తర్వాతనైనా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు.. మరి అలాగే రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు పొడగించలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.