ఏపీ రాజధాని శంఖుస్థాపనకు కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేస్తూ చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఆదివారం ఆయన ఎనిమిది గంటలపాటు క్యాబినెట్ సమావేశం నిర్వహించి శంఖుస్థాపన ఏర్పాట్లపై సమీక్షించారు. అంతేకాకుండా ఈ ఏర్పాట్ల గురించి దాదాపు గంటపాటు మీడియాతో సమావేశం నిర్వహించడం గమనించదగ్గ విషయం. అయితే ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ఓ విషయం చెప్పకనే చెప్పారు. రాజధాని శంఖుస్థాపనకు సింగపూర్, జపాన్‌ల ప్రధానులు రావడం లేదన్న విషయం ఆయన మాటలనుబట్టి స్పష్టంగా అర్థమైంది.
రాజధాని శంఖుస్థాపనకు జపాన్, సింగపూర్‌ల ప్రధానులను రప్పించడానికి బాబు తీవ్రంగా కృషి చేశారు. వారిద్దరూ వస్తే యావత్‌దేశంతోపాటు.. ప్రపంచంలోని బడాబడా ఇన్వెస్టర్లు కూడా అమరావతిలో పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆయన అంచనా వేశారు. ఇక రెండు రోజుల క్రితం వరకు కూడా వారు వస్తున్నట్లే మాట్లాడిన టీడీపీ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం మిన్నకుండిపోయింది. అమరావతిలో ప్రధాని షెడ్యూల్ గురించి స్సష్టంగా మాట్లాడిన చంద్రబాబు.. జపాన్, సింగపూర్‌లనుంచి ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు మాత్రమే హాజరవుతున్నట్లు చెప్పారు. దీన్నిబట్టి వారిద్దరూ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం లేదని అర్థమైంది. దీంతో శంఖుస్థాపన కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు అయ్యింది. ఇతర దేశాల అధినేతలు ఓ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల కోసం భారత్‌కు ప్రత్యేకంగా బయలుదేరి రావడం చాలా అరుదైన విషయం. ఇది తెలిసి కూడా చంద్రబాబునాయుడు వారిని రప్పించడం కోసం శ్రమించడం రాజధాని నిర్మాణంపై ఆయనకున్న శ్రద్ధాఆసక్తులను తెలియజేస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం నుంచి ఆ దేశాధినేతలకు ఆహ్వానాలు అంది ఉంటే వారు తప్పకహాజరై ఉండేవారన్న వాదనలు వినబడుతున్నాయి. ప్రత్యేక హోదా.. ప్యాకేజీల విషయంలోనే కాకుండా ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో కూడా కేంద్రం నుంచి ఏపీకి మద్దతు కరువవడం రాష్ట్రవాసులను బాధించే విషయమే.