హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న వందల ఎకరాల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవాలన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాచిక పారడం లేదు. సెక్రెటెరియట్‌ను అక్కడినుంచి మార్చి ట్యాంకుబండ్ వద్ద వందల కోట్ల విలువైన భూమిని కమర్షియల్‌గా వాడుకోవాలన్న టీఆరశ్రీస్ ఎత్తుగడకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఎర్రగడ్డ చాతి హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదని విపక్షాలు విమర్శించాయి. అటు తర్వాత పెరెడ్ గ్రౌండ్‌లోకి సచివాలయాన్ని మారుద్దామనుకున్నా ఆ భూమిని ఇవ్వడానికి ఆర్మీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత వెనక్కితగ్గారు. ఇదిలావుండగానే మలక్‌పేటలో ఉన్న రేస్‌క్లబ్ భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న ప్రభుత్వ ఆశయం కూడా ఇప్పుడు నెరవేరేలా కనబడటంలేదు.
టర్ఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా మలక్‌పేటలో రేస్‌క్లబ్‌ను దశాబ్దాల క్రితమే ఏర్పాటుచేశారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే మలక్‌పేటనుంచి రేస్‌క్లబ్‌ను తరలిస్తామని ప్రకటించారు. దీనికి రేస్‌క్లబ్ నిర్వాహకులు ససేమిరా ఒప్పుకోలేదు. ఓ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను రేస్‌క్లబ్ భూమిని ఎలాగైన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తాజాగా రేస్‌క్లబ్‌పై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఇక్కడ లెక్కల్లో చూపని రూ. 51 లక్షలను స్వాధీనం చేసుకొని మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దాడులతో బెదిరించి రేస్‌క్లబ్ స్థలాన్ని కబ్జా చేసుకోలేరని యాజమాన్యం చెబుతోంది. రేస్‌క్లబ్‌ను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. 127 ఎకరాల స్థలంలో ఏర్పడ్డ రేస్‌క్లబ్ భూములు కనీసం రూ. వెయ్యి కోట్ల విలువ చేస్తాయి. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం.. ఆ తర్వాత ఉసూరుమంటూ వెనక్కితగ్గడం కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న అలవాటే. మరి రేస్‌క్లబ్ విషయంలో చివరికి ఎటు తేలుస్తారో..!