సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్టీ చక్రవర్తి ప్రధానపాత్రల్లో ఏ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం కొలంబస్. ఆర్.సామల దర్శకుడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయికలు మిస్టీ చక్రవర్తి మరియు సీరత్ కపూర్ లు సినిమాపై తమ స్పందన తెలియజేసారు.
మిస్టీ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటాయి. యువకులు, పెద్దలు తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రమిది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఇందు, చాలా చలాకీగా, హుందాగా ఉండే రోల్. సుమంత్ అశ్విన్ తో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కథకు ప్రాధాన్యత ఇస్తాను.. అందుకే వరుస సినిమాలు చేయట్లేదు. ప్రస్తుతం నా చేతిలో రెండు హిందీ సినిమాలు, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. త్వరలో నా హిందీ సినిమా గ్రేట్ గ్రాండ్ మస్తీ విడుదల కానుంది. కొలంబస్ సినిమా నాకు నటిగా మంచి పేరు తీసుకురావడంతోపాటు మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
సీరత్ కపూర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ చూడని ఒక కొత్త ప్రేమకథను ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాలో నేను నీరజ అనే పాత్ర పోషిస్తున్నాను. కెరీర్ పట్ల శ్రద్ధతోపాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పాత్ర నాది. రన్ రాజా రన్ తో మొదలైన నా కెరీర్ ఇప్పటివరకూ హ్యాపీగా సాగింది. మొదట్లో తెలుగు రాక డైలాగుల విషయంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు తెలుగు అర్ధమవుతుండడంతో కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇప్పటివరకూ అందరూ కొత్త దర్శకులతోనే పని చేసాను. సినిమా సినిమాకి నటిగా పరిణితి చెందుతున్నాను. ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే కథ నచ్చితే తప్ప సినిమా ఒప్పుకోవడం లేదు. కొలంబస్ సినిమాకు నాకు నటిగా మంచి పేరు తీసుకువస్తుందన్న నమ్మకం ఉంది. నా మొదటి సినిమా నుంచి చిత్ర పరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరించింది. ఇకపై కూడా ఇదే విధంగా ఆదరిస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.