రామ్, కీర్తి సురేష్ జంటగా కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను.. శైలజ'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా వచ్చింది..?
సినిమా అవుట్ పుట్ చూసిన తరువాత తృప్తిగా అనిపించింది. చాలా రోజుల తరువాత మంచి రియలిస్టిక్ మూవీలో నటించాననిపించింది. ఇప్పటివరకు నా కెరీర్ లో ఇటువంటి సినిమాలో నటించలేదు. సినిమాలో లవ్, కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. డైలాగ్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. హీరో బాధలో నుండి వచ్చే కామెడీ అందరికి నచ్చుతుంది.
మొదట సినిమా టైటిల్ 'హరికథ' అనుకున్నారు. తరువాత ఎందుకు మార్చాల్సి వచ్చింది..?
హరికథ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. నిజానికి అది 'హరికథ' కాదు.. 'హరి గాడి కథ'. ఆ టైటిల్ అందరికి చెప్తున్నపుడు ఇంట్లో మా అమ్మమ్మ దగ్గర నుండి బయట నా స్నేహితుల వరకు ఎవరికీ ఆ టైటిల్ నచ్చలేదు. సినిమా మొదటి కాపీ చూసిన తరువాత 'నేను.. శైలజ' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావించాం. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే కథ ఇది. అబ్బాయి స్టొరీ నేరేట్ చేస్తుంటాడు.. అందుకే 'నేను.. శైలజ' అనే టైటిల్ పెట్టాం.
ఈ సినిమా కూడా రామ్ స్టైల్ లో స్పీడ్ గా ఉంటుందా..?
స్పీడ్ గా చేస్తుంటే రొటీన్ అంటున్నారు. అందుకే ఈ సినిమాలో డిఫరెంట్ గా చేశాను. ఇప్పటివరకు ఊపు మీద ఉండే క్యారెక్టర్స్ లోనే కనిపించాను. ఈ సినిమాలో మాత్రం న్యాచురల్ గా సింపుల్ గా ఉండే అబ్బాయి పాత్రలో కనిపిస్తాను. సినిమాలో నైట్ క్లబ్ లో పని చేసే డి.జె క్యారెక్టర్ నాది.
కిషోర్ తిరుమల లాంటి కొత్త డైరెక్టర్ తో చేయడం రిస్క్ అనిపించలేదా..?
రిస్క్ అనిపించేది హీరోకు కాదు.. ప్రొడ్యూసర్ కి. మా పెదనాన్న గారు డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ చూడరు. టాలెంట్ చూస్తారు. కథ నచ్చితేనే సినిమా చేస్తారు. నమ్మకంతో కిషోర్ తిరుమల తో సినిమా చేశారు. దానికి తగ్గట్లు ఆయన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ విని చాలా మంది ఫోన్స్ చేసి చెప్పారు. క్రియేటివ్ డైరెక్టర్ తను. ఈ సినిమాతో కిషోర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు.
సినిమా గురించి చెప్పండి..?
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా. చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ లవ్ కోసం తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ సినిమాలో మాత్రం లవ్ అనేది జెన్యూన్ గా ఉంటుంది. తండ్రి, కుతుర్ల మధ్య ఉండే సెంటిమెంట్ అందరికి నచ్చుతుంది. తండ్రి పాత్రలో సత్యరాజ్ గారు బాగా నటించారు. క్లైమాక్స్ లో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయి. సినిమాలో ఉండే పాత్రలన్నీ నటిస్తున్నట్లు కనిపించవు.. బిహేవ్ చేస్తున్నట్లు అనిపిస్తాయి.
తొందరగానే సినిమాను కంప్లీట్ చేసినట్లున్నారు..?
అవునండీ. మొత్తం 55 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులపై ఎంతో ఇంపాక్ట్ చూపించాలి. దానికి తగ్గట్లుగా సమీర్ గారి సినిమాటోగ్రఫీ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కథలో భాగంగా పాటలు ఉంటాయి.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.