నాని, మెహ్రీన్ కౌర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
నేపధ్యం..
నేను పుట్టింది పంజాబ్ లో. న్యూఢిల్లిలో నా చిన్నతనం, చదువు గడిచింది. ఆ తరువాత కెనడా వెళ్లి డిగ్రీ పూర్తి చేశాను. ఇక బొంబాయికి వచ్చి కమర్షియల్ యాడ్స్ లో నటించడం మొదలుపెట్టాను. ఫెయిర్ అండ్ లవ్లీ, పియర్స్ ఇలా చాలా యాడ్స్ లో నటించాను.
ఆడిషన్ చేసి ఎంపిక చేశారు..
హను రాఘవపూడి గారు నన్నొక యాడ్ లో చూసి నా ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోటోలు పంపమని అడిగారు. న్యాచురల్ గా ఉన్న ఫోటోలను పంపాను. అవి ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత ఆయన్నుంచి పిలుపు వచ్చింది. ఆడిషన్ చేసి హీరోయిన్ గా ఎంపిక చేశారు.
రాయలసీమ అమ్మాయి పాత్రలో..
సినిమాలో నా పాత్ర పేరు మహాలక్ష్మీ. రాయలసీమలోని అనంతపురం ప్రాంతానికి చెందిన అమ్మాయి. కుటుంబానికి మంచి విలువనిస్తుంది. బబ్లీగా, బోల్డ్‌గా ఉండే అమ్మాయి. చాలా పొగరుగా, కాన్ఫిడెంట్ గా ఉంటుంది. కృష్ణ, మహాలక్ష్మీలు పదిహేనేళ్ల నుంచి ప్రేమించుకుంటారు. కృష్ణను పెళ్లి చేసుకోవడమే మహాలక్ష్మీ జీవిత లక్ష్యం.
అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి..
ఇదొక ప్రేమ కథని చెప్పలేము. సినిమాలో యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కృష్ణ, మహాలక్ష్మి మధ్య జరిగే సంఘటనలే ఈ సినిమా. నిజానికి కృష్ణ చాలా భయస్తుడు. మహాలక్ష్మి ప్రేమను దక్కించుకునే ప్రాసెస్ లో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుంటాడు.
నాని న్యాచురల్ యాక్టర్..
నాని చాలా సహజంగా నటిస్తాడు. మంచి మనిషి. తను నటుడు మాత్రమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. ఈ సినిమా ఒప్పుకునే వరకు తను నటించిన సినిమాలు చూడలేదు. ఆ తరువాత 'ఈగ', 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్' సినిమాలు చూశాను. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఒక భాష అని అనుకోలేదు..
హీరోయిన్ గా ఓ బాలీవుడ్ సినిమాతో పరిచయం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి అవకాశం ఎక్కడ లభిస్తే, ఆ భాషలో సినిమా చేయాలనుకున్నాను. ప్రతి ఇండస్ట్రీ చాలా గొప్పది.
అదే నా డ్రీమ్ రోల్..
కంగనా రనౌత్ నటించిన 'క్వీన్', కాజోల్ నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' వంటి సినిమాల్లో నటించాలనుంది. అవే నా డ్రీమ్ రోల్స్.
అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం..
అనుష్క శెట్టి అంటే నాకు చాలా ఇష్టం. తను నటించిన 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సింగం' సినిమాలు చూశాను. లవ్లీ హ్యూమన్ బీయింగ్. ఇప్పటివరకు తను కలవలేదు. కలిస్తే మాత్రం పెద్ద అభిమానిని అని చెప్తాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
తెలుగు, హిందీ భాషల్లో నటించడానికి మాటలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.