సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 74 వ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య నాగారంలోని పద్మాలయ స్టూడియోలో వైభవంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కృష్ణ కేకు కోసిన అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''నా పుట్టినరోజు వేడుకలు ఎక్కువగా ఊటీలోనే జరుపుకుంటాను. కానీ రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే జరుపుకుంటున్నాను. 50 సంవత్సరాలుగా నా చిత్రాలను వీక్షిస్తూ.. నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఏభై ఏళ్ళ క్రితం 'తేనెమనసులు' అనే ఈస్ట్ మన్ కలర్ తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. గూడాచారి117, అల్లూరి సీతారామారాజు, సింహాసనం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాను. అలానే ప్రస్తుతం ముప్పలనేని శివ దర్శకత్వంలో 'శ్రీ శ్రీ' అనే సినిమాలో నటించాను. ఆ చిత్రాన్ని నా పుట్టినరోజు కానుకగా ప్రేక్షకులకు అందించనున్నాను. విదేశాల్లో ఆన్ లైన్ పద్దతిలో రిలీస్ చేస్తున్నాం'' అని చెప్పారు.
విజయనిర్మల మాట్లాడుతూ.. ''అభిమానుల మధ్య కృష్ణ గారు ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు కానుకగా అభిమానులకు 'శ్రీ శ్రీ' చిత్రాన్ని అందిస్తున్నారు. ముప్పలనేని శివ ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించారు'' అని చెప్పారు.
ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''పండంటి కాపురం సినిమా చూసి కృష్ణ గారికి అభిమానిగా మారాను. ఆయన నటించిన కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్ గా పని చేశాను. ఆయన ద్వారా పరిచయమయిన ఎందరో దర్శకులు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన ఆశీస్సులు అంత పవిత్రంగా ఉంటాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు భారీతనాన్ని పరిచయం చేసింది కృష్ణ గారే. ఆయన నటించిన 'శ్రీ శ్రీ' సినిమా పెద్ద విజయం సాధించాలి'' అని చెప్పారు.