అనాధ చిన్నారుల కోసం, వృద్ధుల కోసం, గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు కరీంనగర్ జిల్లాలో 2006 లో మధుసూదన్ అనే వ్యక్తి ఓ సంస్థను ప్రారంభించారు. దాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో చౌదరి ఎం.ఆర్. వడ్లపట్ల గారు హైదరాబాద్ లో చిల్డ్రన్ సురక్ష సొసైటీ అనే పేరుతో స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు స్వయంగా ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా..
దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''పిల్లల క్షేమం కోరిన మధుసూదన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చౌదరి గారు హైదరాబాద్ లో చిల్డ్రన్ సురక్ష సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు అధ్వర్యంలో ప్రారంభించడం మంచి విషయం. తస్లీమియా వ్యాధి గ్రస్తులను ఆదుకోవడం కోసం ఈ సంస్థ ఎన్నో సేవలను అందిస్తోంది. కరీంనగర్ లో 200 మందిని దత్తత తీసుకొని సేవలు అందిస్తోన్న ఈ సంస్థ అక్కడికే పరిమితం కాకూడదని తెలంగాణా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలని ఇక్కడ కూడా సంస్థను ప్రారంభించారు. ప్రభుత్వ సహకారం లేకుండా సొంత డబ్బుతో ఈ సంస్థను నడిపించడం గొప్ప విషయం. దీనికి ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వరకు వెళితే ఆయన సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి'' అని చెప్పారు.
చౌదరి ఎం.ఆర్. వడ్లపట్ల మాట్లాడుతూ.. ''మధుసూదన్ గారు కరీంనగర్ లో 2006 లో స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. ఎందరో అనాధ పిల్లలను, వృద్ధులను, తస్లీమియా వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నారు. మూడేళ్ళ క్రితం ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన స్పూర్తితోనే హైదరాబాద్ లో చిల్డ్రన్ సురక్ష సొసైటీను ప్రారంభించాం. లాభాపేక్ష లేకుండా సొంత డబ్బుతో సంస్థను రన్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ సహకారం లభించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఎమ్మెల్సీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ''ఇంట్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా స్వార్ధంతో బ్రతుకుతున్న ఈరోజుల్లో సొంత డబ్బుతో వ్యాధిగ్రస్తులను, చిన్నారులను ఆదుకోవడం మంచి విషయం. దీనికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను'' అని చెప్పారు.
కె.రాఘవ మాట్లాడుతూ.. ''ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ నా అభినందనలు'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాద్, పి.వి.గౌడ్, పబ్బా లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.