సుధాకర్ కొమ్మాకుల, సుదీర్ వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు బి.ఎ సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'కుందనపు బొమ్మ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు ముళ్ళపూడి వరా విలేకర్లతో ముచ్చటించారు.
సినిమాల్లో కొంచెం గ్యాప్ వచ్చింది..
2008 లో 'విశాఖ ఎక్స్ ప్రెస్' సినిమా తరువాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. కాని ఎందుకో అవి కార్యరూపం దాల్చలేదు. అలా అని నేను ఖాళీగా అయితే లేను. నా చెల్లెలికి అమెరికాలో కంపనీ ఉంది. ఆ సంస్థకు నేను యాడ్స్ చేస్తూ ఉంటాను. టీవీ సీరియల్ ప్రొడక్షన్ లో కూడా ఉన్నాను. సినిమాల్లోనే కాస్త గ్యాప్ వచ్చింది. పని లేకుండా అయితే లేను.
సినిమా బాగా వచ్చింది..
సక్సెస్ లేకపోతే పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వరు. నేను వాళ్ళని బ్లేం చెయ్యట్లేదు. వాళ్ళ సమస్యలు వాళ్లకి ఉంటాయి. అందుకే నాకున్న బడ్జెట్ పరిధిలో కొత్త వాళ్ళతో చేయాలనుకున్నాను. అందరం స్నేహితుల్లా కలిసి పని చేశాం. సినిమా బాగా వచ్చింది.
అమ్మాయి చుట్టూ తిరిగే కథ..
ఈ సినిమాలో సెంటర్ క్యారెక్టర్ అమ్మాయిదే.. తన చుట్టూనే కథ తిరుగుతుంటుంది. మానవతా.. విలువలకు ప్రాముఖ్యత ఉన్న సినిమా. ఓ ఏడాది పాటు తెలుగమ్మాయి కోసం వెతికాం. ఈ సినిమాకి భాష చాలా ముఖ్యం. తెలుగు డైలాగ్స్ చక్కగా చెప్పగలిగే అమ్మాయి కావాలి. అందుకే చాందిని చౌదరిని ఎన్నుకున్నాం. సుచి అనే పాత్రలో తను బాగా నటించింది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
విలేజ్ లో జరిగే కథ..
ఈ కథ మొదలవ్వడం సిటీలో మొదలవుతుంది. ఓ పది నిమిషాల తరువాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. సుధాకర్, సుదీర్ ఇద్దరు సిటీ నుండి విలేజ్ కు వచ్చే అబ్బాయిలు. సుధాకర్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. కథ తనతోనే ఓపెన్ అయ్యి, తనతోనే ముగుస్తుంది.
చాలా కథలు రాసుకున్నాను..
నా అల్లుడు సినిమాకు నేను జస్టిస్ చేయలేకపోయాను. విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా విషయంలో మాత్రం నాకు తృప్తిగా ఉంది. ఆ తరువాత కూడా థ్రిల్లర్ కథలు చాలానే రాసుకున్నాను. ఈ ఏడేళ్ళ గ్యాప్ లో సుమారుగా 15 కథలు సిద్ధం చేశాను. అన్నింటిలో ఈ కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. నిర్మాతలకు, రాఘవేంద్ర రావు గారికి కూడా ఈ కథే నచ్చింది. అందుకే ఆయన ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
నాకున్న గొప్ప వరం అది..
నేను సీరియల్స్, సినిమాలు రెండు కంఫర్టబుల్ గానే హ్యాండిల్ చేయగలను. నాకున్న గొప్ప వరమేమిటంటే.. మర్చిపోవడం. సినిమాలు చేసేప్పుడు సీరియల్స్ విషయాలు మర్చిపోతాను. సీరియల్స్ చేసేప్పుడు సినిమా గురించి మర్చిపోతాను.
పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది..
కీరవాణి గారితో పని చేయాలని పది సంవత్సరాలుగా అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆయనకు నచ్చకపోతే చేయను..
నేను సినిమా చేయాలనుకున్నప్పుడు రాజమౌళికి కథలు వినిపిస్తాను. తనకు నచ్చకపోతే ఆ కథ పక్కన పెట్టేస్తాను. తను సక్సెస్ లో ఉన్నాడని కాదు.. తనపై ఉన్న నమ్మకం అలాంటిది. విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమా కథ తనకు చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాడు. తనే డైరెక్ట్ చేయాలనుకున్నాడు. కాని కుదరలేదు. బాహుబలి సినిమా పనుల్లో బిజీగా ఉండడం వలన తనకు ఈ సినిమా కథ చెప్పడం కుదరలేదు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇప్పటివరకు ఏది కమిట్ కాలేదు. కాని బాపు, రమణ గార్లు చేయాలనుకొని వొదిలేసిన ఓ లవ్ స్టోరీను నేను చేయాలనుకుంటున్నాను. కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. ఆ కథకు నిత్య మీనన్ లాంటి హీరోయిన్ అయితే బావుంటుంది అని ఇంటర్వ్యూ ముగించారు.