Advertisementt

చిరు ‘బాక్సులు బద్దలైపోతాయి’ కి 25 ఏళ్లు!

Tue 18th Oct 2016 08:07 PM
rowdy alludu,rowdy alludu completes 25 years,sri sairam arts,k venkateswara rao,chiranjeevi,k raghavendra rao  చిరు ‘బాక్సులు బద్దలైపోతాయి’ కి 25 ఏళ్లు!
చిరు ‘బాక్సులు బద్దలైపోతాయి’ కి 25 ఏళ్లు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించిన 'రౌడీ అల్లుడు' ఓ సెన్సేష‌న్‌. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. శోభన, దివ్య భారతి క‌థానాయికలుగా న‌టించారు. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర్వాత ఆ రేంజులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన చిత్ర‌మిది. ఈ సినిమా 18 అక్టోబ‌ర్ 1991లో రిలీజైంది. ఇప్ప‌టికి 25 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఇన్నేళ్లుగా ఈ చిత్రం ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్లో మ‌ర‌పురాని చిత్రంగా నిలిచిపోయిందంటే అందుకు కార‌ణాలెన్నో.

'కొండవీటి దొంగ', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'కొదమసింహం', 'రాజా విక్రమార్క', 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్', 'గ్యాంగ్ లీడర్' .. ఇవ‌న్నీ ఓ రాబిన్ హుడ్, ఓ పోలీస్ ఆఫీసర్, ఒక కౌబాయ్ తరహా కథలతో తెర‌కెక్కిన చిత్రాలు. వాట‌న్నిటికీ భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పూర్తి స్థాయి కామెడీ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌ 'రౌడీ అల్లుడు'.

ఒకే పోలిక‌తో ఏడుగురు ఉంటారంటారు. ఈ సినిమాలో ఒకే పోలిక‌తో ఉన్న ఇద్ద‌రు ఆడిన నాట‌కం ఏంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. కోట్లాది రూపాయ‌ల ఆస్తికి వార‌సుడు అయిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ (క‌ల్యాణ్‌)ని మోసం చేసి ఆస్తి కొట్టేయాల‌ని అదే పోలిక‌తో ఉన్న ఆటో జానీని తెచ్చి కుట్ర చేస్తే అస‌లు నిజం తెలుసుకున్న ఆటోజానీ ఆ దుర్మార్గుల పాలిట య‌మ‌కింక‌రుడిగా ఎలా మారాడ‌న్న‌దే - రౌడీ అల్లుడు క‌థాంశం. మోస‌గాళ్ల‌కు మోస‌గాడిగా జానీ వేసిన స్కెచ్ ఏంట‌న్నది ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించారు కె.రాఘ‌వేంద్ర‌రావు. మెగాస్టార్ ద్విపాత్రాభిన‌యం ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టింగ్ పెర్ఫామెన్స్ తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నంలోకి దించేసిందంటే అతిశ‌యోక్తి కాదు.

చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన పది సినిమాల్లో రౌడీ అల్లుడు ఒక‌టి. మిగిలిన తొమ్మిదింటిలో చిరంజీవి నటన ఒక ఎత్తు అయితే ఇందులో చిరంజీవి నటన మరో ఎత్తు. విద్యావంతుడు, పెద్దింటి కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త పాత్రలో కల్యాణ్ హుందాగా క‌నిపిస్తే, 'ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్' చేరుస్తూ చిన్నచిన్న మోసాలు చేస్తూ, ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని సాగించే ఆటో జానీ పాత్రలో చిరు జీవించారు. రెండు పాత్రల్లోని భిన్న పార్స్యాలను తన ఆంగికం, వాచికంతో అద‌ర‌హో అన్న రీతిలో మెప్పించారు. 'వీడెవడండీ బాబూ ..' అంటూ కోట,'బొంబైలో అంతే, బొంబైలో అంతే' అంటూ అల్లు నవ్వుల్తో ముంచెత్తుతూ భయంకరమైన విలనీతో అద్బుత‌మైన పెర్ఫామెన్స్ చేశారు. 'భగవంతుడు అంతే బాబు అప్పుడప్పుడూ 'కమాల్' చేస్తూ ఉంటాడు' అంటూ వచ్చి రాని హిందీలో అల్లు మాట్లాడటం. 'ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్స్', 'నో టచింగ్స్', 'సిట్టింగ్స్', 'స్టాన్డింగ్స్' అంటూ వచ్చీ రాని ఇంగ్లీష్ లో జానీ సంభాషణలు సినిమాకు బలమైన బలం !! ‘బాక్సులు బద్దలైపోతాయి’ అనే డైలాగ్ స్టేట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.

మెగాస్టార్ 'స్టేట్ రౌడీ', 'గ్యాంగ్ లీడర్’ చిత్రాలకు సంగీతం అందించిన బప్పీలహరి ఈ సినిమాకు కూడా చ‌క్క‌ని సంగీతం అందించారు. 'చిలుకా క్షేమమా' అంటూ మొదటి పాటగా వచ్చే డ్యూయెట్ సూపర్ హిట్ సాంగ్, జానీ పాత్ర ఇంట్రో కాగానే డిస్కోశాంతితో వచ్చే ‘అమలాపురం బుల్లోడా .. నీ బొంబై చూడాలా’ అనే సాంగ్ మాస్ పాటల్లో నేటికీ, ఎప్పటికైనా గుర్తుండిపోయే పాట. ఆ పాటలో చిరంజీవి డ్యాన్సులోని స్పీడుని ఈ తరం నటులు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కూడా చేయలేరు. ‘కోరి కోరి కాలుతోంది’ అంటూ సాగే తొలిరాత్రి పాట రొమాంటిక్ గా ఉంటుంది. ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు, లవ్లీ మై హీరో, తద్దినక తప్పదిక పాటల్లో చిరంజీవి, దివ్యభారతి డ్యాన్సులు కొత్తగా ఉంటాయి. ‘లవ్లీ మై హీరో ..’ పాట మధ్యలో వచ్చే ఒక సుదీర్ఘమైన మ్యూజిక్ బిట్ కి చిరంజీవి దివ్యభారతి చేసే డ్యాన్సు ప్రత్యేకంగా ఉంటుంది.

ఆ మ్యాన‌రిజ‌మ్స్ చిరంజీవికి త‌ప్ప ఎవ‌రికీ సాధ్యం కాదు! - డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `రౌడీ అల్లుడు` చిత్రానికి డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మాత‌. చిరంజీవితో `న్యాయం కోసం`, `చ‌క్ర‌వ‌ర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించిన త‌ర్వాత హ్యాట్రిక్ చిత్రంగా `రౌడీ అల్లుడు` చిత్రాన్ని నిర్మించారు. 25 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆ సినిమా విశేషాలు డా.వెంక‌టేశ్వ‌ర‌రావు ఇలా చెప్పుకొచ్చారు.

*నేను నిర్మాత‌న‌వ్వ‌డానికి అల్లు అర‌వింద్ గారి ప్రోత్సాహం, ప్రోద్భ‌ల‌మే కార‌ణం. ఆయ‌నే చిరంజీవి గారితో సినిమాలు చేసే అవ‌కాశం క‌ల్పించారు. నిర్మాత‌గా న‌న్ను నిల‌బెట్టారు. ఓవైపు డాక్ట‌రుగా ప్రాక్టీసు, బిజీ లైఫ్‌, మ‌రోవైపు సినిమాల నిర్మాణం రెండు బాధ్య‌త‌ల్ని స‌వ్యంగా నిర్వ‌ర్తించ‌గ‌లిగానంటే అర‌వింద్ ఇచ్చిన స‌హ‌కారంతోనే. పేరుకు నేను నిర్మాత‌నే అయినా బావ‌గారే (అర‌వింద్‌) అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టేవారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్ .. నాకు ఇద్ద‌రూ రెండు క‌ళ్లు.

*చిరంజీవి గారితో `న్యాయం కోసం` తొలి సినిమా. ఆ త‌ర్వాత `చ‌క్ర‌వ‌ర్తి` మూవీ నిర్మించాను. మూడో సినిమాగా `రౌడీ అల్లుడు` చేశాను. ఆ త‌ర్వాత మెగాస్టార్‌తోనే `అన్న‌య్య` సినిమా తీశాను. నేను నిర్మించిన సినిమాల‌న్నీ 100రోజులు ఆడిన‌వే. వాటిలో అన్న‌య్య సినిమా 175రోజులు ఆడింది. రీసెంటుగా బ‌న్ని క‌థానాయ‌కుడిగా నిర్మించిన `రేసుగుర్రం` చిత్రం 100రోజులు పూర్తి చేసుకుని చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించింది.

*రౌడీ అల్లుడు 18 అక్టోబ‌ర్, 1991లో రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సాయిరామ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాను. తొలి రెండు చిత్రాల్ని వ‌సంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మించాను. రౌడీ అల్లుడు సినిమాకి క‌ర్త, క‌ర్మ‌, క్రియ కె.రాఘ‌వేంద్ర‌రావు, అల్లు అర‌వింద్‌, చిరంజీవి త్ర‌యం. ఆ ముగ్గురే ప్రాజెక్టును ముందుకు న‌డిపించారు. చిరంజీవి డ‌బుల్ రోల్‌లో ఓ సినిమా చేద్దామ‌ని రాఘ‌వేంద్ర‌రావు గారు ముందుకొచ్చారు. సీనియ‌ర్ ర‌చ‌యిత స‌త్యానంద్, అల్లు అర‌వింద్, చిరంజీవి అంతా క‌లిసి క‌థ‌పై చ‌ర్చించారు. అనంత‌రం ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభించాం. అలా రౌడీ అల్లుడు సెట్స్‌కెళ్లింది. రౌడీ అల్లుడు త‌ర్వాత మ‌ళ్లీ త్రిపుల్ రోల్‌తో 'ముగ్గురు మొన‌గాళ్లు' చిత్రం చేశారు మెగాస్టార్‌.

*నేను ఓ వైపు డాక్ట‌రుగా బిజీగా ఉంటూనే, అప్పుడ‌ప్పుడు షూటింగుల‌కు వెళ్లేవాడిని. ఆ క్ర‌మంలోనే న‌న్ను నిర్మాత‌గా ఎంక‌రేజ్ చేస్తూ.. చిరంజీవి గారు, అర‌వింద్ గారు సినిమాల నిర్మాణం వైపు పురికొల్పారు. మ‌ద్రాస్‌లో పాతిక సంవ‌త్స‌రాలు పైగానే ఉన్నాను. హైద‌రాబాద్‌లో 15 సంవ‌త్స‌రాలుగా ఉంటున్నా. 2001 ఆగ‌స్టులో హైద‌రాబాద్‌లో అడుగుపెట్టాను. అయితే మ‌ద్రాసులో వ‌డ‌ప‌ల్లి- మ‌సీదు వీధిలో (మురుగ‌న్ వీధి ప‌క్క‌న‌) డాక్ట‌ర్ వృత్తిని కొన‌సాగించేవాడిని. నిత్యం 35-40 మంది వ‌ర‌కూ క్లినిక్‌కి వ‌చ్చేవారు. జూనియ‌ర్ ఆర్టిస్టులకు అర్థ రూపాయికే వైద్యం అందించాను ఆ రోజుల్లో. మావ‌య్య (కీ.శే.అల్లు రామ‌లింగ‌య్య‌) గారి ప్రోద్భ‌లంతోనే అదంతా. 1990 నుంచి రూ.5 ఫీజుతో వైద్యం చేశాను. ఇప్ప‌టికీ చెన్న‌య్ నుంచి పేషెంట్స్ వ‌స్తే న‌న్ను క‌ల‌వ‌కుండా వెళ్ల‌రు. అలాంటి అభిమానం, అదృష్టం నాకు ద‌క్క‌డం దైవ‌సంక‌ల్పం అనే అనుకుంటాను.

*రౌడీ అల్లుడు చిత్రంలో మెగాస్టార్ ద్విపాత్రాభిన‌యం హైలైట్‌. అందులో ఆటోజానీ క్యారెక్ట‌ర్ .. మెగాస్టార్ పండించిన కామెడీ, మ్యాన‌రిజ‌మ్స్‌ని అంత తేలిగ్గా మార్చిపోలేం. చిరంజీవి ..ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావుతో ప్ర‌తిదీ చ‌ర్చించి చేసేవారు. అయితే ఆ బాడీ లాంగ్వేజ్, మ్యాన‌రిజ‌మ్స్‌ మాత్రం చిరంజీవి గారి సొంత‌ ప్ర‌య‌త్న‌మే. నూటికి నూరు పాళ్లు ఆయ‌న సృజించిన‌దే. అంతేకాదు అల్లు రామ‌లింగ‌య్య గారు `బొంబాయిలో ఇంతే .. బొంబాయిలో ఇంతే` అంటూ న‌వ్వులు పూయించిన ఆ డైలాగ్ ని అలా చెప్ప‌మ‌ని సూచించింది కూడా చిరంజీవి గారే. ఆ జ‌ర్ధా కిళ్లీ వేసుకునే స్ట‌యిల్‌.. ఆయ‌న‌కు ఆయ‌నే ఎన్నో డెవ‌ల‌ప్ చేసుకుని చేసేవారు. ద‌ర్శ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌నిత‌నం, ర‌చ‌యిత‌గా ఎన్నో అద్భుత చిత్రాల‌కు స్టోరి, డైలాగ్స్ అందించిన స‌త్యానంద్ గారి అనుభ‌వం ఆ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యాయి. ఇక సినిమా మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచేందుకు బ‌ప్పీల హ‌రి సంగీతం క‌లిసొచ్చింది. చిలుకా క్షేమ‌మా .. కులుకా కుశ‌ల‌మా పాట ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌. క‌థానాయిక‌లు శోభ‌న, దివ్య భార‌తి ఇద్ద‌రికీ ఆ సినిమాతో మంచి పేరొచ్చింది.

*ప్ర‌స్తుతం `ఖైదీ నంబ‌ర్ 150` షూటింగులో మెగాస్టార్ బిజీ. నేను ఆన్‌లొకేష‌న్‌కి వెళ్లాను. లారెన్స్ మాష్ట‌ర్ సార‌థ్యంలో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఒక్క‌ టేక్‌కే ఓకే చెప్పేయ‌డం... చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం చూశాను. మెగాస్టార్ బాడీలో టింజ్ ఇప్ప‌టికీ మార‌లేదు. అదే ఛ‌రిష్మా. అదే హుషారు. ఇప్పటికీ న‌వ‌యువ‌కుడిలా స్టెప్పులేయ‌డం చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది. నేటిత‌రం హీరోలు ఆయ‌న్ని చూసి ఇన్‌స్ప‌యిర్ అవ్వాల్సిందే. ఆ రేంజులో డ్యాన్సులేస్తున్నారు. మెగాస్టార్ లుక్ ఇప్ప‌టికీ గ్యాంగ్ లీడ‌ర్‌ని త‌ల‌పిస్తోంది.

*బ‌న్ని హీరోగా `రేసుగుర్రం` బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. మీతో సినిమా చేస్తాను పెద‌నాన్న అని అడిగాడు చ‌ర‌ణ్‌. త‌న‌తో ఓ సినిమా చేయాలి. మీ బ్యాన‌ర్‌లో అన్ని సినిమాలు హిట్లే. నాతో సినిమా చేయ‌వా డాక్ట‌రు మామా? అని అడిగాడు శిరీష్‌. త‌న‌తోనూ సినిమా చేస్తాను. ..అంటూ చిట్‌చాట్‌ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ