ఏ మంత్రం వేసావెతో విజయ్ దేవరకొండ అంచనాలను అందుకుంటాడు!
'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అతి తక్కువ వ్యవధిలోనే యూత్ ఐకాన్‌గా మారాడు. ఇక విజయ్ నటించిన తాజా చిత్రం 'ఏ మంత్రం వేసావె'లో ఆయన పాత్ర చిత్రణ చాలా వైవిధ్యంగా వుంటుంది. నేటి యువత అందరూ అతని పాత్రలో చూసుకుంటారు. కథాంశంలోని కొత్తదనం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. భద్రాద్రి, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య, సింగం-3 వంటి చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్న చిత్రం 'ఏ మంత్రం వేసావె'. విజయ్ దేవరకొండ కథానాయకుడు. శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
థ్రిల్లర్ అంశాల కలబోత
ఈతరం మనోభావాల్ని ప్రతిబింబించే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. థ్రిల్లర్ అంశాల కలబోతగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి యువకుడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఈ సినిమాలో కథానాయకుడికి కంప్యూటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. అవే సర్వస్వంగా గడుపుతుంటాడు. ఒక అమ్మాయి పరిచయం అతడి జీవిత గమనాన్ని ఎలా మార్చివేసింది? అతడు ఎలా ప్రయోజకుడయ్యాడు? అన్నదే చిత్ర ఇతివృత్తం.
విజయ్ పాత్ర చిత్రణ నవ్య పంథాలో వుంటుంది.
పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్నారు. అనతికాలంలోనే అసంఖ్యాకమైన అభిమానుల్ని సంపాదించకున్నాడు. ఏ మంత్రం వేసావెలో విజయ్ పాత్ర చిత్రణ నవ్య పంథాలో వుంటుంది. నేటి యువత అందరూ అతని పాత్రతో కనెక్ట్ అవుతారు. కథాంశంలోని కొత్తదనం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. చిత్ర ట్రైలర్స్, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. పరిశ్రమలోని ప్రముఖులు చాలా మంది సినిమా చూసి బాగుందని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం.
అర్జున్‌రెడ్డితో పోల్చుకోవద్దు...
ఓ సంచలన విజయం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు వుండటం సహజం. బాహుబలి తర్వాత ప్రభాస్‌ను తిరిగి అదే స్థాయి పాత్రలో ఊహించుకోవడం సాధ్యం కాదు కదా.అర్జున్‌రెడ్డితో విజయ్ దేవరకొండ యువతలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం భావ్యం కాదనుకుంటున్నాను.
ఏకకాలంలో మూడుచిత్రాలు..
ఇతర వ్యాపారాలతో బిజీగా వుండటం వల్ల సినిమాలకు కొంత బ్రేక్ నిచ్చాను. ప్రస్తుతం మా సంస్థలో మూడు చిత్రాలు పూర్వ నిర్మాణదశలో ఉన్నాయి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెడతాం. ద్రోణ చిత్రాన్ని రూపొందించిన కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. రవిచంద్ర దర్శకత్వంలో ఓ వినూత్న కథా చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో వున్నాం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నది. వీటితో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఓ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాన్ని తీయబోతున్నాం. కథ సిద్ధమైంది. దీనికి కన్నడంలో మంచిపేరున్న రఘరాజ్ దర్శకత్వం వహిస్తారు. ఏకకాలంలో ఈ మూడు చిత్రాల నిర్మాణాల్ని చేపడుతాం. ఈ చిత్రాలకు హీరోలు కూడా దాదాపు ఖరారయ్యారు. వారి పేర్లు త్వరలో వెల్లడిస్తాం. ఈ సంవత్సరాంతంలో అగ్ర హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించే ప్రయత్రాలు చేస్తున్నాం. ఇక నా కెరీర్‌లో సూర్య వర్సెస్ సూర్య వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చింది. సృజనాత్మకత మేళవించిన ఇతివృత్తమది. ఈ సినిమాను హిందీలో అగ్ర హీరోతో రీమేక్ చేసే సన్నాహాల్లో వున్నాను. బాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు ఆ సినిమా నచ్చింది. ఇతర వ్యాపారాలు ఎన్ని వున్నా సినిమారంగాన్ని నేను అమితంగా ప్రేమిస్తాను. ప్రతిభాంతులైన ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తూ సృజనాత్మక కథాంశాల్ని ప్రేక్షకులకు అందివ్వాలన్నేదే నా లక్ష్యం
కేసీఆర్‌గారి అడుగుజాడల్లో...
కేసీఆర్‌గారు అత్యంత సమర్థుడైన నాయకుడు. థర్డ్‌ఫ్రంట్ గురించి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్‌గారి అడుగుజాడల్లో మేమంతా పయనిస్తాం. ఆయన ఏదైనా సంకల్పిస్తే దానిని సాధించేవరకు విశ్రమించరు. ఆయన సేవలు దేశానికి కూడా అవసరం అనుకుంటున్నాను. కేసీఆర్‌గారికి దేశవ్యాప్తంగా ప్రజల దీవెనలు లభించాలని ఆకాంక్షిస్తున్నాను... అంటూ ముగించారు.