సాధారణంగా ఓ ప్రాంతీయ భాషా చిత్రం కోసం దేశమంతటా ఎదురుచూడటం జరగదు. అలా జరిగేది టాప్ స్టార్స్ నటించిన బాలీవుడ్ సినిమాలకే. కానీ నేడు ఓ ప్రాంతీయ కథానాయకుడు భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే విదేశాల్లోనూ తన మార్కెట్‌ను విస్తరింపజేస్తూ, ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూసేలా చేస్తున్నాడు. సందేహం లేదు.. ఆ కథానాయకుడు ప్రభాస్!
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న ‘రాధే శ్యామ్’ చిత్రానికి వెల్లువెత్తుతున్న అంచనాలు అసాధారణం. అచిర కాలంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన యు.వి. క్రియేషన్స్ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ టి సిరీస్‌తో కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమా విడుదల ఎప్పుడనే విషయంలో అనిశ్చితి నెలకొన్నా, అది ఎప్పుడు విడుదలైనా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో అక్కడి టాప్ హీరోల సినిమాల స్థాయిలో ‘రాధే శ్యామ్’ విడుదలవనున్నదంటేనే అర్థమవుతుంది, ప్రభాస్‌కున్న ప్రజాదరణ సంగతి. ఏకైక పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగినందు వల్లే నార్త్, సౌత్ లాంగ్వేజెస్‌లో బయ్యర్లు రికార్డ్ స్థాయి రేట్లకు ఆ సినిమాను కొనుగోలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తోంది. అలాగే దేశంలోనే ఒక సినిమాకు సంబంధించి అత్యధిక ఆదాయం సమకూర్చుకుంటున్న నటునిగా ప్రభాస్ ఇప్పటికే వార్తల్లో నిలిచాడు. ‘రాధే శ్యామ్’లో నటించినందుకుగాను ఆయనకు అక్షరాలా 55 కోట్ల రూపాయలకు పైగా సమకూరుతున్నాయి.
సినిమా విషయానికొస్తే ప్రభాస్ సరసన తొలిసారి పూజా హెగ్డే నటిస్తోండగా, విలన్లుగా సచిన్ ఖేడ్కర్, కునాల్ రాయ్ కపూర్ కనిపించనున్నారు. ఇవాళ పూజ టాలీవుడ్ నంబర్‌వన్ నాయికగా నీరాజనాలు అందుకుంటోంది. ‘అల.. వైకుంఠపురములో’ మూవీలో చేసిన క్యారెక్టర్ తర్వాత మురళీశర్మ ఇమేజ్ అసాధారణంగా పెరిగింది. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా మురళీశర్మ పేరు పొందారు. ఆయన ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార భాగ్యశ్రీ కనిపించనుండటం ఓ ప్రత్యేకాకర్షణ.
2018 అక్టోబర్ 6న ‘రాధే శ్యామ్’ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. తర్వాత ఇటలీలో, ఆ తర్వాత కొవిడ్-19 వ్యాప్తి కారణంగా నిలిచిపోయే సమయానికి జార్జియాలో షూటింగ్ జరిగింది. జార్జియాలో కేవలం వారం రోజుల షూటింగ్‌తో అర్ధాంతరంగా యూనిట్ ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాకి రవీందర్ కళా దర్శకునిగా పనిచేస్తున్నాడు. అయితే ఇంతదాకా మ్యూజిక్ డైరెక్టర్ ఫైనలైజ్ కాకపోవడం ఆశ్చర్యకరం.
యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్, పూజ జంటగా ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో దానికి లైక్స్, ట్వీట్స్ వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని భాషల సినీ ఇండస్ట్రీల్లో స్తబ్దత నెలకొన్నట్లే టాలీవుడ్‌లోనూ స్తబ్దత ఉంది. కానీ ‘రాధే శ్యామ్’ మూవీపై అలాంటి స్తబ్దత లేదు. దానిపై ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతూ పోతోంది. వసూళ్లపరంగా దేశంలోని బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశాలు, ‘బాహుబలి’ సినిమాల సరసన నిలిచే అవకాశాలు ‘రాధే శ్యామ్’కు ఉన్నాయనే విశ్లేషకుల అంచనాలు నిజమవుతాయో, లేదో 2021 వేసవిలో తేలిపోతుంది.