ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ సంయుక్తంగా.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా లేక్ టాహో నేపథ్యంలో అంతా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. భార్గవ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత ప్రదాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కిరణ్ కొండమాడుగుల. సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తో.. అమెరికాలో జాబ్ చేసుకుంటూ కూడా.. అంతా కొత్తవారితో.. సినిమా ప్రేక్షకులకు సంథింగ్ స్పెషల్ అందించాలనే ధ్యేయంతో ఈ సినిమా చేశానని చెబుతున్న దర్శకుడు కిరణ్‌తో సినీజోష్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
సినీజోష్: నమస్కారం కిరణ్‌గారు.. ఎలా ఉన్నారు?
కిరణ్: నమస్తే అండి.. అంతా బాగున్నామండి.
సినీజోష్: ముందుగా.. ఇప్పుడంతా భయపడుతున్న కరోనా టైమ్‌లో ‘గతం’ చిత్రాన్ని చిత్రీకరించి.. విడుదల చేస్తున్నారు. చిత్రీకరణ కరోనా టైమ్‌లో జరిపారా? లేక అంతకు ముందే జరిపారా?
కిరణ్: కరోనా టైమ్‌లో చిత్రీకరణ చేయలేదండి. అంతకంటే ముందే అంటే 2018లో షూటింగ్ స్టార్ట్ చేశాం. 2019 అంతా చిత్రీకరణ జరిపాం. 2020 మార్చికి సినిమా అంతా రెడీ చేసి రిలీజ్ చేద్దాం అనుకునే టైమ్‌కి కరోనా రూపంలో బ్రేక్ పడింది. కరోనా వల్ల మా సినిమాకి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ జరగలేదు. ఈ గ్యాప్‌లో చిన్న చిన్న మైనర్ వర్క్స్.. చేశామంతే. ఒకరకంగా మాకు కరోనా మంచే చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే.. అమెజాన్ ద్వారా ఈ సినిమా దాదాపు 200కు పైగా దేశాలలో విడుదల అవుతుంది. మాములుగా థియేటర్స్‌లో విడుదల చేస్తే.. మాకు 150 థియేటర్స్ కూడా దొరికేవి కావేమో.
సినీజోష్: దర్శకుడిగా మీ ప్రయాణం గురించి చెప్పాల్సి వస్తే.. ?
కిరణ్: 2012లో యుఎస్‌కి వచ్చాను. సినిమా అంటే పిచ్చి, ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది. అమెరికా వచ్చాక అది ఇంకా ఎక్కువైంది. షార్ట్ ఫిల్మ్స్‌కి అప్పుడు మంచి క్రేజ్ ఉంది. సహజంగానే ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆ ఇష్టంతోనే 13 సినిమాల వరకు చేశాను.. అందులో 7 రిలీజ్ అయ్యాయి. 6 ఆగిపోయాయి. అయితే వాటి ద్వారా నేను తెలుసుకుంది ఏమిటంటే.. ఏది ఎలా చేయకూడదో అనేది తెలిసింది. వాటి ద్వారా వచ్చిన అనుభవంతో ఈ సినిమా తీయడం జరిగింది.
సినీజోష్: మీ ‘గతం’ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు?
కిరణ్: థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. వేరే భాషలలో ఉన్న సినిమాలను కూడా సబ్ టైటిల్స్ ఉంటే చాలు చూసేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోని సినిమాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటంతో అనేక జోనర్ల సినిమాలను చూస్తున్నాం. ఇటువంటి థ్రిల్లర్స్ మీద ప్రేక్షకులు బాగా ఇంట్రస్ట్ పెడతున్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమాల గురించి చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా కష్టం. చివరి వరకు సస్పెన్స్‌ని క్యారీ చేయలేకపోతే బోర్ కొట్టేస్తుంది. అటువంటి సస్పెన్స్ క్రియేట్ చేయలేకపోతే థ్రిల్లర్ సినిమాలు తీయడం కూడా వేస్ట్. ఇంటర్వెల్‌కే ట్విస్ట్ తెలిసిపోతే ప్రేక్షకులు ఇంక సినిమా చూడాల్సిన అవసరం లేదు. సో.. ఇటువంటి వన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి థ్రిల్ ఫీలవుతారు. అది మాత్రం హండ్రెడ్ పర్సంట్ చెప్పగలను.
సినీజోష్: లేక్ టాహో నేపథ్యంలో అని అంటున్నారు..? దాని గురించి చెబుతారా?
కిరణ్: కాలిఫోర్నియాలో లేక్ టాహో అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది. మంచి చెరువు, ఆ చెరువు చుట్టూ కొండలు.. ఆ కొండల మీద మంచు. ఇంత అద్భుతమైన లోకేషన్ దొరకడం చాలా కష్టం. దీనిని మేము థ్రిల్లర్ కోసం వాడాం.
సినీజోష్: ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు? మంచి మంచి షాట్స్ పడ్డాయ్. ట్రైలర్ కోసమేనా? సినిమా అంతా అటువంటి మ్యాజిక్ ఊహించవచ్చా?
కిరణ్: సినిమా అంతా అటువంటి షాట్స్ ఉన్నా బోర్ కొడతాయ్. ఇది యాక్షన్ థ్రిల్లర్ కాదు. యాక్షన్ ఉంటుంది కానీ.. యాక్షన్ కోసమే ఈ సినిమా చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా తెరకెక్కించాం. ఇందులో కెమెరా వర్క్ అంతా హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. ట్రైలర్ నచ్చిందని చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సినిమా కూడా అంతకుమించి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను.
సినీజోష్: కాన్సెఫ్ట్ విషయానికి వస్తే.. మెమరీలాస్ కాన్సెఫ్ట్ అంటున్నారు.. ఇప్పటికే గజిని, నేను మీకు తెలుసా? వంటి చిత్రాలు వచ్చాయి. మీరు ఇదే కాన్సెఫ్ట్ తీసుకోవడం చూస్తుంటే.. ఇది కల్పితమా? లేక ఏదైనా యదార్థ సంఘటనా?
కిరణ్: మెమరీలాస్ కాన్సెఫ్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. నిజమే. కానీ నాకు పర్సనల్‌గా థ్రిల్లర్ జోనర్ అంటే చాలా ఇష్టం. ఈ జోనర్‌లో అంతర్లీనంగా ఏదైనా చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు మెమరీలాస్ కాన్సెఫ్ట్ వచ్చింది. ఈ జోనర్‌లో ఇప్పటి వరకు యాక్షన్, లవ్, కామెడీ.. వంటి వాటినే బేస్ చేసుకున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేదు. కథని పోలిన కథలు చాలా ఉంటాయి కానీ.. కథనాలు వేరుగా ఉంటాయి. సినిమాకి స్క్రీన్‌ప్లే చాలా ఇంపార్టెంట్. స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది. మొదటి నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కసారి ఫార్వార్డ్ చేస్తే.. ఇక అంతే.. ఏం అర్థం కాదు. పాత్రలతో కనెక్ట్ అయితేనే.. ప్రేక్షకుడికి కూడా సినిమా బాగా రీచ్ అవుతుంది. దీనికోసం బాగా వర్క్ చేశాం.
సినీజోష్: ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగిందని అన్నారు. ఇటీవల వచ్చిన నిశ్శబ్దం కూడా అక్కడే చిత్రీకరణ జరిగింది. అమెరికాలోనే చిత్రీకరణ చేయడానికి కారణం ఏమైనా ఉందా?
కిరణ్: రెండు కారణాలు ఉన్నాయండి. నేనిక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయ్. అలాగే సినిమా అంటే ప్యాషన్. రెండూ ఎలా మ్యానేజ్ చేయడం అని.. ఆలోచిస్తే.. ఇక్కడే సినిమా చేస్తే.. ఎలా ఉంటుందని ఆలోచించి ఈ సినిమా మొత్తం అమెరికాలోనే చేశాం. అందుకే ఇప్పటి వరకు ఎవరూ చూపించని లొకేషన్లు, కెమెరా, లైటింగ్.. ఇలా ఏదైనా సరే.. ఒక భారీ ప్రొడక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగాలని చాలా కష్టపడ్డాం. 10 గంటలు ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే.. మిగతా టైమ్‌ని ఫ్యామిలీ కోసం, ఇటు సినిమా కోసం కేటాయించడం మాములు విషయం కాదు. చాలా త్యాగాలు చేస్తాం.. కనబడదు కానీ.. అది సినిమా రూపంలో తెలుస్తుంది. ఈ సినిమా సెట్‌లో కూడా 6 లేదా 7గురు మాత్రమే ఉండేవాళ్లం. 50, 100 మంది సెట్‌లో ఉండరు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగించేలా మా వర్క్, అవుట్‌పుట్ ఉంటుంది.
సినీజోష్: అమెరికాలో జాబ్ అంటున్నారు.. చాలా మంది సినిమా మీద ప్యాషన్‌తో మంచి మంచి జాబ్స్ వదిలేసి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు. మీకూ అటువంటి అవకాశం వస్తే.. యుఎస్ వదిలి వస్తారా?
కిరణ్: నిర్మాతల చుట్టూ.. వందల మంది కథలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మరి కిరణ్ అనేవాడికి వారు అవకాశం ఎందుకు ఇవ్వాలి?. కిరణ్ అనేవాడిని పిలిచి అవకాశం ఇవ్వాలంటే.. ఖచ్చితంగా అతనిలో ఉన్న వర్త్ ఏమిటనేది తెలియాలి. అందుకే ఎవరితోనో ఎందుకు అని చెప్పి.. ముందు మనమేంటో తెలియాలి.. అనే ఈ సినిమా చేశాం. ఈ సినిమా తర్వాత అటువంటి కాల్ వస్తే.. ఖచ్చితంగా వచ్చేస్తాను. అంత పిచ్చి నాకు సినిమా అంటే.
సినీజోష్: సినిమాకి మ్యూజిక్ కూడా హైలెవల్‌లో ఉంది. ప్రత్యేకంగా ఏమైనా శ్రద్ధ పెట్టారా?
కిరణ్: శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. చాలా బాగా చేశారు. ‘గూఢచారి’, ‘క్షణం’, ‘ఎవరు’.. వంటి సినిమాలు ఆయన చేసినవే. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు గూఢచారి నడుస్తుంది. అప్పుడే డిసైడ్ అయిపోయాం.. పడితే ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడాలి అని. ఆయనని అప్పట్లో అప్రోచ్ అవ్వడానికి కూడా మాకంతగా ఏం తెలియదు. తెలిసిన ఫ్రెండ్స్, మీడియా పీపుల్ ద్వారా ఆయన కాంటాక్ట్ సాధించాం. ఆయన కూడా కథ మొత్తం విన్నారు. విన్న తర్వాతే కథలో సత్తా ఉంది చేద్దాం.. అని చెప్పారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు లేకుండా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కొత్తవాళ్లకి ఎంకరేజ్ చేద్దాం అనుకుని ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు.
సినీజోష్: ఈ సినిమా నిర్మాతల గురించి చెబుతారా?
కిరణ్: ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ ప్రొడక్షన్ చూసుకుంటే.. మ్యాంగో మాస్ మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది. నిర్మాతలందరూ నా ఫ్రెండ్స్.. ఫ్యామిలీ మెంబర్సే. ఇంత పెద్ద సినిమా అంత గొప్పగా తీయగలిగామంటే.. వారిచ్చిన సహకారమే. బయటివాళ్లు ఎవరూ లేరు. అమెరికా నుంచి మంచి మంచి కంటెంట్ చిత్రాలు వస్తే.. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ(అమెరికా) చాలా మంది యంగ్ స్టర్స్ సినిమాలు చేయాలని వెయిట్ చేస్తున్నారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఎంకరేజ్ చేస్తే.. ముందు ముందు ఇంకా మంచి స్టోరీలు వస్తాయి. మేమున్నాం అనే భరోసా ఇస్తూ.. మంచి కథలతో సినిమాలు తీయండి. మేం ఎంకరేజ్ చేస్తాం.. అనే సపోర్ట్ ఉంటుంది కాబట్టి.. ఇట్లాంటి సినిమాలు ఇంకా ముందు ముందు వస్తాయని అనుకుంటున్నా.
సినీజోష్: ఇటువంటి థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేయాలంటే బిగ్ స్క్రీన్ చాలా బావుంటుంది. థియేటర్స్‌కి అనుమతులు వచ్చాయిగా? అటు వైపు ఆలోచించలేదా?
కిరణ్: మేము ముందు థియేటర్స్‌లోనే అని ఆలోచించాం. కానీ ఈ ఆరు నెలల్లో జనాలు థియేటర్స్ గురించి మాట్లాడుకోవడం మానేసి.. ఓటీటీల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మాకు అర్థమైంది.. ఓటీటీ అని. నా పర్సనల్‌గా అంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా నేను థియేటర్‌లో సినిమా చూడడానికే ఇష్టపడతాను. అయితే మేమున్న పరిస్థితుల్లో మాకు 150 థియేటర్లు దొరకడం కూడా కష్టమే. డబ్బులు వస్తాయనే విషయం కాదు కానీ.. మా సినిమా ప్రపంచం మొత్తం చూడాలనే ఈ సినిమా తీశాం. ఇలా చూస్తే.. ఇంతకంటే పెద్ద ఫ్లాట్‌ఫామ్ దొరకదు.
సినీజోష్: ఈ సినిమాని అల్రెడీ కొంత మంది చూశారని అన్నారు.. వారి నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది?
కిరణ్: సినిమా రిలీజ్‌కు ముందు టెన్షన్స్ పెట్టుకోదలచుకోలేదు. అందుకే నాలుగు వందల మందికి పైగా ఈ సినిమాని చూపించాం. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని.. మొత్తం రెడీ చేశాం. చూసిన అందరి నుంచి చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే మేము రిలీజ్ టైమ్‌లో కూడా ఎటువంటి టెన్షన్స్ పడటం లేదు. ఈ సినిమా చేసింది కొత్తవాళ్లు అని ఎవ్వరూ అనరు.. అని చాలా మంది అన్నారు.
సినీజోష్: నోటెట్ ఆర్టిస్ట్స్ ఎవరూ ఈ సినిమాలో కనిపించడం లేదు.. ఒక వేళ నోటెడ్ యాక్టర్స్‌ని ఈ చిత్రంలో నటింపజేయాలని అనుకుని ఎవరినైనా ఊహించుకున్నారా?
కిరణ్: చాలా సార్లు అనుకున్నానండి. ట్రైలర్ మీరు చూసి ఉంటారు.. భార్గవ్ అనే అతను కొంచెం ఏజ్డ్‌గా కనిపిస్తారు. ఆయన పాత్రలో టాలీవుడ్‌లో జగపతిబాబుగారిని అనుకునేవాడిని. బాలీవుడ్‌లో అమితాబచ్చన్‌గారిని అనుకునేవాడిని. అంటే ఇప్పుడు చేసిన వారు బాగా చేయలేదు అని కాదు కానీ.. స్టార్ పవర్ స్టార్ పవరే కదా. చాలా సార్లు సెట్‌లో జగపతిబాబు, అమితాబచ్చన్‌లను తలుచుకున్నాం. రెండో పాత్రలో రాకేష్ చేశాడు.. ఆయన పాత్రలో మాత్రం ఎవరినీ అనుకోలేదు.
సినీజోష్: ఫైనల్‌గా తెలుగు ప్రేక్షకులకు ఏం చెబుతారు?
కిరణ్: అందరూ ఈ సినిమాని ఇష్టపడతారు.. థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫార్వర్డ్ చేయకుండా సినిమా మొత్తం చూడండి. ఇది నేను ఎందుకు చెబుతున్నానో.. నవంబర్ 6న విడుదల కాబోతోన్న సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఆ పాత్రలు మీతో ఉంటాయ్. సినిమా చూశాక శాటిస్‌ఫ్యాక్షన్‌తో టీవీ ఆపేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కొత్తవాళ్లు తీశారు అని కాకుండా.. చూస్తున్న రెండు గంటలలో ఎంటర్‌టైన్ అయ్యామా లేదా అనేది మాత్రమే చూడండి. చూసి నచ్చితే పదిమందికి చెప్పండి. అప్పుడు ఇటువంటి సినిమాలు ఇంకా వస్తాయ్. ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళుతుంది.
సినీజోష్: ఓకే సార్.. కంగ్రాట్స్.. ఆల్ ద బెస్ట్.
కిరణ్: థ్యాంక్యూ సో మచ్.
--------------------- o ------------------------