Advertisementt

ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: వినోద్‌ అనంతోజు (మిడిల్ క్లాస్ మెలోడీస్)

Fri 20th Nov 2020 08:46 PM
director vinod anantoju,middle class melodies,special interview  ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: వినోద్‌ అనంతోజు (మిడిల్ క్లాస్ మెలోడీస్)
Exclusive interview: Middle Class Melodies Director Vinod Anantoju ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: వినోద్‌ అనంతోజు (మిడిల్ క్లాస్ మెలోడీస్)
Advertisement
Ads by CJ

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, బిగిల్‌ వంటి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నూతన దర్శకుడు వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌ 20న ఓటీటీలో అగ్రగామిగా దూసుకుపోతోన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వినోద్‌ అనంతోజుతో సినీజోష్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..

సినిమాలో బొంబాయ్‌, గుంటూరు అంటున్నారు.. అసలు మీ నేపథ్యం ఏమిటి?

వినోద్‌- నేను గుంటూరులోనే పుట్టి, పెరిగారు. నేను తీసుకున్న పాత్రలు కూడా తెలిసిన మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌లో నుంచే చాలా వరకు తీసుకున్నాం. నాకు తెలిసిన వారందరూ గుంటూరు వారే కావడంతో.. కథ కూడా గుంటూరు కథే అయ్యింది. అలా ఇది గుంటూరుకి సంబంధించిన సినిమా అయింది.  

అనేక రంగాలు ఉండగా.. సినిమా రంగంవైపే రావడానికి కారణం?

వినోద్‌- నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పుస్తకాల పబ్లిషింగ్‌ ఇండస్ట్రీలో పని చేసేవారు. నాకు కూడా అప్పటి నుంచి రకరకాల పుస్తకాలు చదవడం అలవాటైంది. అందులో నుంచి కథలు చెప్పాలనే కోరిక కలిగింది. ఎలా కథ చెబితే.. వినేవారు ఆసక్తికరంగా కనెక్ట్ అవుతారనే ఆలోచనలతో.. సినిమాలు మంచి మీడియం అనిపించింది. దాని కోసం షార్ట్ ఫిల్మ్స్‌ చేయడం మొదలుపెట్టాను. ఇంజనీరింగ్‌ చదివేటప్పటి నుంచి చేస్తున్నాను. ఆ తర్వాత ఐటీ కంపెనీలో జాబ్‌ చేశాను. 3 ఇయర్స్‌ బ్యాక్‌.. ఇక సినిమాలు ట్రై చేయాలని అని చెప్పి.. జాబ్‌కి రిజైన్‌ చేసి.. వచ్చేశాను.

టాలీవుడ్‌ ఇప్పుడు బాగా కమర్షియల్‌ ఇండస్ట్రీ అయింది.. మరి మీకు కాన్సెప్ట్ బేస్డ్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలని ఎలా అనిపించింది?

వినోద్‌- నా దృష్టిలో కమర్షియల్‌, కాన్సెప్ట్ అనే వర్గాలు ఏమీ లేవండి. సినిమా జనాలకు బాగా నచ్చితే, బాగా లైకబుల్‌గా ఉంటే అదే కమర్షియల్‌. అలా చూస్తే.. ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్‌ సినిమా. ఎందుకంటే ఇందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయ్‌. మంచి మంచి పాత్రలు, మంచి మంచి సీన్లు, సాంగ్స్‌, హాస్యం, ఎమోషన్‌ ఇలా ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అందరూ మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌తో కనెక్ట్ అవుతారు. ఆ రకంగా చూస్తే.. ఇది చాలా పెద్ద కమర్షియల్‌ సినిమా.

ట్రైలర్‌లో బొంబాయ్‌ చట్నీని బాగా హైలెట్‌ చేశారు.. దానికేమైనా చరిత్ర ఉందా?

వినోద్‌- గుంటూరులో ఎన్ని రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ దొరుకుతాయో.. అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది గుంటూరు పక్కన మా రైటర్‌ వాళ్ల ఊరిలో.. వాళ్ల ఇంటి ఎదురుగానే ఉన్న చిన్న టిఫిన్‌ సెంటర్‌ ఉంది. అక్కడ బొంబాయ్‌ చట్నీ అని పెట్టారు. అది తిన్నాక.. అరే.. ఇంత టెస్టీగా ఉంది.. ఇన్నాళ్లు ఇక్కడే ఉన్నాం.. తెలియలేదే అనిపించింది. అలా ఒక పల్లెటూరి వాడు వచ్చి గుంటూరులో బొంబాయ్‌ చట్నీ పెడితే.. బాగుంటుందని కదా.. అని అనిపించింది. అందుకే అది తీసుకున్నాం.

హీరో విషయానికి వస్తే.. స్టార్‌ హీరో తమ్ముడిలా చూశారా? లేక ఆనంద్‌లానే చూశారా? అతనితో మీ వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?

వినోద్‌- ఆనంద్‌తో వర్క్‌ చేయడం చాలా బాగుంది. విజయ్‌ తమ్ముడు అనే బిహేవియర్‌ అసలెప్పుడూ ఆనంద్‌లో చూడలేదు. ఈ కథకి అలాంటి అవసరం కూడా లేదు. ఈ కథకి ఒక పల్లెటూరి అబ్బాయి.. మన పక్కింటి అబ్బాయి అనిపించేలా ఉంటే చాలు. ఆనంద్‌ పర్ఫెక్ట్‌గా అలా అనిపించాడు. అందుకే ఆనంద్‌ని ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది.

హీరోయిన్‌ వర్ష గారితో.. ?

వినోద్‌- సెటిల్డ్ యాక్టర్‌.. ఆమెతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద స్టార్లతో చేసింది ఆమె. వర్క్‌లో కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. తన గురించి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్నీ తనే చూసుకుంటుంది. తన సీన్స్‌ అని తానే రాసుకుని, ప్రీపేర్‌ అవుతుంది. డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. జస్ట్ మనం యాక్షన్‌ అంటే చాలు.. ఆమె పాత్ర పర్ఫెక్ట్‌గా చేసేస్తుంది. మంచి నటి.

ఇందులో హ్యూమర్‌ ఎక్కువగా కనిపిస్తుంది.. ఇది మీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు?

వినోద్‌- చాలా మంచి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాను. హ్యూమరస్‌గా ఉంటూనే ఎమోషనల్‌గా టచ్‌ చేస్తుందీ చిత్రం. వీటిని బ్యాలెన్స్‌ చేయడం మాములు విషయం కాదు. కానీ ఈ సినిమాలో మాకు బాగా కుదిరింది. రేపు సినిమా చూసిన తర్వాత అందరూ అదే అంటారు. అందరూ గుర్తించే సినిమా అవుతుందని, నాకు కూడా మంచి పేరు తీసుకువస్తుందని అనుకుంటున్నాను.

ట్రైలర్‌ చూస్తే.. ఈ సినిమాలో తండ్రి పాత్ర చాలా హైలెట్‌ అనేలా ఉంది. ఆ రోల్‌ ప్లే చేసిన అతను చాలా సహజంగా, ఫ్రెష్‌గా అనిపిస్తున్నారు.. అతని గురించి?

వినోద్‌- ఆ పాత్ర పేరు కొండలరావు. సినిమాలో హైలెట్‌గా ఉంటుంది ఆయన పాత్ర. అందరికీ గుర్తుండిపోతుంది. సినిమాలో రాఘవ(హీరో)కి, తండ్రి కొండలరావుకి మధ్య ఉండే రిలేషన్‌షిప్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కథలో ఆ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఆ పాత్రకి సహజంగా నటనతో అద్భుతంగా చేసే వ్యక్తి కావాలి. బాగా వెతికాం. ఆయన పేరు గోపరాజు రమణగారు. నాటకరంగంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయనని ఒప్పించి ఈ పాత్రని చేయించాం. అద్భుతంగా చేశారు. ట్రైలర్‌లో కొంచమే చూశారు.. సినిమాలో ఆయన పాత్ర ఇంకా బాగా అలరిస్తుంది.

ట్రైలర్‌, సాంగ్స్‌.. అన్నీ మంచి హిట్ అయ్యాయి.. మ్యూజిక్‌ గురించి ఏం చెబుతారు?

వినోద్‌- సినిమాకి సంగీతం శ్రీకర్‌ ఇచ్చాడు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాటలు కాకుండా.. కథతో కలిసి నడిచే పాటలు ఈ సినిమాలో ఉంటాయి. ఎమోషన్‌ని అర్థం చేసుకుంటూ పాటలు ఇవ్వడం కొంచెం కష్టమైన పనే అయినా.. చక్కగా చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వచ్చేసి చెన్నైకి చెందిన విక్రమ్‌ అనే అతను చేశారు. ఇద్దరూ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాకి ఒక పిల్లర్‌లా మ్యూజిక్‌ ఉంటుంది.

బిగ్‌ స్క్రీన్‌పై కాకుండా ఓటీటీలో అంటే అమెజాన్‌లో విడుదల అవుతుంది.. మీకెలా అనిపిస్తుంది?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాములుగా చిన్న సినిమాలకు థియేటర్స్‌కి ఎంత మంది వచ్చి చూస్తారు అనేది డౌటే. ఈ కోవిడ్‌ టైమ్‌లో అసలు థియేటర్‌కి వచ్చి ఎంత మంది చూస్తారు.. అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు అమెజాన్‌లో రిలీజ్‌ అంటే.. ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరూ సినిమా చూస్తారు. ఇలా చూస్తే.. మా సినిమా చాలా ఎక్కవ మందికి రీచ్‌ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్‌గా.. అంటే పక్క రాష్ట్రాల వారు, పలు భాషల వారు సినిమా చూస్తారు. ఇది చాలా మంచి మీడియా.. సినిమాకి అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా అందరూ అమెజాన్‌ ప్రైమ్‌లో చూడండి.. సినిమా అందరికీ నచ్చుతుంది. 

Exclusive interview: Middle Class Melodies Director Vinod Anantoju:

Director Vinod Anantoju talks about Middle Class Melodies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ