పెద్దస్టార్ కావడానికి 5 వరస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్ చలో. ఇంకా నాలుగు కావాలి. వరుడు కావలెనురెండోది పెద్ద హిట్. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా అని అంటున్నారు యువ హీరో నాగశౌర్య.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం వరుడు కావలెను. రీతు వర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య గురువారం విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు...
*2018లో చలో సక్సెస్ పార్టీలో ఎడిటర్ చంటిగారి ద్వారా అక్క లక్ష్మీ సౌజన్య పరిచయమయ్యారు. చలో సినిమా నచ్చి నన్ను అభినందించి, ఓ కథ చెబుతా వింటావా అన్నారు. సరే అని విన్నాను. అప్పుడు మొదలైన జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతుంది. ఫైనల్‌గా సినిమా విడుదలకు వచ్చింది, మా అక్క కల నిజమయ్యే రోజు వచ్చింది.
*పెళ్లి పీటల ముందు వరకూ...
ప్రతి ఇంట్లో చూసే కథే ఇది. 30 ఏళ్లు దాటిన అబ్బాయి, అమ్మాయిలను పెళ్లి ఎప్పుడు? సంబంధాలు చూడాలా? అని అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి ఎంత వరకూ రెడీగా ఉన్నారు అన్నది ఆలోచించరు. ఇలాంటివి అన్నీ మనం వింటుంటాం. ఈ పాయింట్ జనాలకు బాగా రీచ్ అవుతుందని అంగీకరించా. ఇది పక్కా యంగ్‌స్టర్స్ కథ. మెచ్యుర్డ్ లవ్‌స్టోరీ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయి. పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది. ఆడవాళ్ల ఓపిక, ప్రేమను ఒప్పించేంత వరకూ వెయిట్ చేసే ప్రేమ కథ ఇది. వ్యక్తిగతంగా 70, 80 శాతం నాకీ కథ కనెక్ట్ అయింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌గారు ఓ సీన్ రాశారు. ఆ సీన్‌లో నేను యాక్ట్ చేశా. డైలాగ్‌లు చెప్పా. ఇందులో 15 నిమిషాల క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశాలను అందరూ ఫ్రెష్‌గా ఫీలవుతారు. ‘అత్తారింటికి దారేది’లో నదియాగారు పోషించిన పాత్ర చూసి ఆమెతో ఈ తరహా పాత్ర చేయించడం కరెక్టేనా అనిపించింది. అయితే షూట్‌లో ఆమె అభినయం చూసి ఆ పాత్రతో ప్రేమలో పడిపోయా. అంత వేరియేషన్ ఊహించలేదు.
*బయట యాక్ట్ చేయలేను.
ఈ కథ విన్నప్పుడు బావుంది అనిపించింది. షూట్‌కి వెళ్లాక మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా అనిపించింది. ఎడిటింగ్ సూట్‌లో అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక.. బ్లాక్‌బస్టర్ అని అర్థమైంది. సినిమాలో ఏదన్నా డౌట్‌గా ఉంటే నా ఫేస్‌లో ఈజీగా తెలిసిపోతుంది. నేను సినిమాల్లోనే యాక్ట్ చేయగలను. బయట యాక్ట్ చేయలేను. నాకు ఈ సినిమా మీద అంతగా నమ్మకం ఉంది. చినబాబుగారు నా కుటుంబ సభ్యులకు సినిమా చూపించమని చెప్పారు. ‘సినిమా మీద డౌట్ ఉంటే చూపించొచ్చు. ఇక్కడ ఏ డౌట్ లేనప్పుడు జనాలతో కలిసి చూడటమే బావుంటుంది సర్’ అని అమ్మవాళ్లకు సినిమా చూపించలేదు అన్నాను. ఆయన లాంటి నిర్మాతలు పరిశ్రమకు అవసరం. కథకు ఏం కావాలో వారికి తెలుసు.
*పెళ్లి గురించి మీ అభిప్రాయం...
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. నా పెళ్లి విషయంలో నాకు పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు. మనం ఎంత ప్లాన్ చేసిన పెళ్లి విషయంలో రాసి పెట్టిందే జరుగుతుంది. వచ్చిన భార్యను బాగా చూసుకోవాలనుకుంటా. తనకు ప్రైవసీ ఇవ్వాలి. ఆమె ఫ్రొషెషన్‌కు గౌరవం ఇవ్వాలి. ఫైనల్‌గా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అంతే!
*మరింత స్ఫూర్తినిచ్చింది...
నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతున్నా. ఈ రంగంలో అడుగుపెట్టాక నాకు మంచి సపోర్ట్ దక్కింది. ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ అలా మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఆయన మాటలు ఇంకా కష్టపడాలనేంత స్ఫూర్తినిచ్చింది. బన్నీ అన్న కాంప్లిమెంట్స్‌కి థ్యాంక్స్.
*ఇంకా మూడు సినిమాలు కావాలి...
నాకు ఉన్న పెద్ద హిట్ చలో. ఇంకా నాలుగు కావాలి. వరుడు కావలెను రెండోది పెద్ద హిట్. అశ్వద్ధామ సక్సెస్ కాదు అంటే నేను ఒప్పుకోను. నర్తనశాల వంటి ఫ్లాప్ సినిమా తర్వాత నాకు బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా అశ్వద్ధామ. ఒకే రోజు ఎదగడం కంటే ఒక్కో మెట్టు ఎక్కడం మంచిదని నెమ్మదిగా వెళ్తున్నా.
*మహిళా దర్శకులతో కంఫర్ట్ ఎక్కువ...
గతంలో నేను నందినీ రెడ్డిగారితో పని చేశా. అమ్మాయి డైరెక్టర్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్లకి కోపం త్వరగా రాదు. ఓపిక ఎక్కువ. దేనికీ త్వరగా రియాక్ట్ కారు.. ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే రియాక్ట్ అవుతారు. అన్ని పనులు సమకూర్చుతారు. మేల్ డైరెక్టర్స్‌తో పని చేయడంలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది.
*అది నా డ్రీమ్ ప్రాజెక్ట్...
అవసరాల శ్రీనివాస్‌తో చేస్తున్న ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఈ సినిమా పనులు మొదలుపెట్టి 4 ఏళ్లు అవుతుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమది. అందులో శౌర్యాను ఏడు రకాలుగా చూస్తారు. నారీ నారీ నడుమ మురారి చిత్రం నేను చేయడం లేదు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఆ బాధ్యత నేనే తీసుకుంటా. ఎందుకంటే అమ్మ సజెషన్ తీసుకుంటే సినిమా అటు ఇటు అయితే నీవల్లే అని మాట వస్తుంది. అది మంచిది కాదు. అమ్మ ఇచ్చిన సలహాలు తీసుకుంటా. నేను ఎప్పుడు కింద పడిపోలేదు. నేను మెల్లగా నిలబడుతున్నా. ఓటీటీకి నేను రెడీగా లేను. నన్ను నేను 70ఎంఎంలో చూసుకోవాలనుకుంటున్నా. నా సినిమాతో విడుదలవుతున్న రొమాంటిక్ కూడా బాగా ఆడాలి.