బాలీవుడ్ సినిమాల్లో ఎంత భారీ బడ్జెట్ సినిమాలైనా, ఎంత బడా స్టార్స్ నటించినా ఒక్కసారి సినిమా థియేటర్స్ లోకి వచ్చింది అంటే.. దాని తాలూకు అంకెలన్నీ తేటతెల్లమైపోతాయి. అక్కడ కొంతమంది పాపులర్ ఫిలిం క్రిటిక్స్, కొంతమంది సీనియర్ ట్రేడ్ ఎనలిస్ట్స్, అండ్ మరికొన్ని మీడియా సంస్థలు ఆ సినిమా తాలూకు బిజినెస్, ఆ సినిమా తాలూకు కలెక్షన్స్ ని వెల్లడిస్తూ ఉంటాయి. అక్కడి ప్రేక్షకులు, పత్రికలూ దానినే ప్రామాణికంగా తీసుకుంటాయి. అదే ఫైనల్. అదేంటో అక్కడ ఫాన్స్ కూడా మనలాగా యుద్దాలు చేసుకోరు, వర్గ యుద్దాలు చెయ్యరు. అది అంతవరకు బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ కల్చర్ అంతే.
ఇక మన దక్షిణాది పరిశ్రమకి వస్తే అందుకు పూర్తిగా విరుద్ధం. కన్నడ, మలయాళ పరిశ్రమలు కాస్త బెటర్ అని చెప్పుకోవాలి ఆ విషయంలో.. ఎంతోకొంత ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. అక్కడ కూడా ఔత్సాహికులు ఉంటారు.. కాబట్టి కాస్త కాస్త కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ తెలుగు, తమిళ పరిశ్రమలకు విషయానికి వస్తే మాత్రం అబ్బో మన లెక్కే వేరు. మన లెక్కలే వేరు. తమిళ వాళ్ళు సేమ్ ఇలాగే ఇంతుంటే అంతని చెప్పుకోవడాలు, తక్కువొచ్చినా ఎక్కువ వచ్చింది అని చూపించుకోవడాలూ, ఎక్కువ హైప్ చేసుకోవడాలూ ఈ కల్చర్ అంతా అక్కడుంది. తుస్ మన్న సినిమాకి కూడా కస్సు బుస్ అనడం వాళ్ళకి అలవాటు. బట్ ఫైనల్ గా రిజల్ట్ ఈజ్ రిజల్ట్.
ఇక తెలుగు విషయానికి వస్తే ఆహా మనవాళ్ళ కథే వేరు. అది ముఖ్యంగా ఈమధ్యకాలంలో కలెక్షన్స్ కల్చర్ అనేది పూర్తిగా కరెప్ట్ అయ్యిపోయింది అని చెప్పాలి. వై బికాజ్ కొందరు హీరోలు తమ సినిమాల కలెక్షన్స్ వెల్లడించకూడదు. కలెక్షన్స్ టాపిక్ తీసుకురాకూడదు అనేది ముందుగానే నిర్మాతలకు ఆంక్షలు పెడుతున్నారు. దాని వలన నిర్మాణ సంస్థలు ఏమి చెయ్యలేకపోతున్నాయి. ఇంకొన్ని సినిమాలకి కొందరు హీరోలైతే ఎంతొచ్చింది అనేది కాకుండా తమకి ఎంత కావాలి, ఎంత కలపాలి అనేది ముందే చెప్పేసి ఉంచుతున్నారు. నిర్మాతలు అటు అలాంటి హీరోలని వదులుకోలేరు, ఇటు ఇలాంటి హీరోలని వదలలేరు. తప్పని పరిస్థితి. పోనీ ఇదైనా సవ్యంగా సక్రమంగా జరుగుతుందా అంటే.. ఇవ్వని వాడు ఎలాగూ ఎవ్వడు. ఇచ్చేవాడు పూర్తిగా ఇవ్వడు. ఫస్ట్ వీక్ ఇంత అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. అది అధికారిక ప్రకటన అనుకుంటాము. సెకండ్ వీక్ అప్పటికేమైనా సినిమా స్టడీగా ఉంటే.. ఇంకో పోస్టర్ వస్తుంది ఇంత అని. సరే అనుకుంటాం అఫీషియల్ అనౌన్సమెంట్ కాబట్టి. థర్డ్ వీక్ అప్పటికి గనక సినిమా థియేటర్స్ లో ఉంటే ఇంకో పోస్టర్ ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. 25 డేస్ పోస్టర్ లాగా. అంతే ఇప్పుడు అంతకుమించి సినిమాలు ఆడే పరిస్థితి లేదు. అలా ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. కానీ అది కూడా జరగడం లేదు. అలాంటి స్పందనేం రావడం లేదు. అక్కడితో ఆగిపోతుంది అంతే. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ గా సైలెంట్ అయ్యిపోతాడు ప్రొడ్యూసర్.
ఆ సినిమా తాలూకు బిజినెస్ ఏమిటి? షేర్ ఏమిటి? గ్రాస్ ఏమిటి? క్లోసింగ్ ఏమిటి? అనేది ఎటువంటి అధికారిక ప్రకటన ఉండదు. అది ఎవరికి వాళ్ళు వేసేసుకోవాల్సిందే. ఏ బ్యానర్ నుండి అటువంటిది రావడం లేదు. ఒకప్పుడు పాత సినిమాలకి ఉండేదట. ఈ బడ్జెట్ లో సినిమా తీస్తే, ఫైనల్ గా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత మిగిలింది అనేవి ఆ లెక్కలేవో ఉండేవట. ఇప్పుడు అలాంటి వాటికి నోచుకోవడం లేదు. సరే ఓకె. అది పక్కనబెట్టేస్తే అధికారిక ప్రకటన వదిలెయ్యండి. అనధికారిక లెక్కల విషయానికి వస్తే రోజు రోజుకి శృతి మించిపోతుంది మన తెలుగు సినిమా అంకెల గారడీ. ఒక్కొక్క హీరో ఫాన్స్, ఒక్కొక్క హీరో పిఆర్ టీం గ్రూప్ ని ఫామ్ చేసుకోవడం వలనో, వాళ్ళు వేసే లెక్కలు వేరేలా ఉంటున్నాయి. అలాగే వెబ్ సైట్స్ ఎవరికి వాళ్ళు మేము ట్రాకర్స్ అని చెప్పుకుంటూ కలెక్షన్స్ వేసెయ్యడం. సపోజ్ ఒక వెబ్ సైట్, ఫస్ట్ డే కలెక్షన్ ఇది, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇది పోస్ట్ వెయ్యగానే.. మిగతా వాళ్ళు దానిని చూడడం, ఇప్పుడు ఆ సినిమా మీద పాజిటివ్ స్టాండ్ తీసుకున్నవాడు ఎంతో కొంత పెంచి వేసి చేతి వాటం చూపిస్తాడు. ఆ సినిమా అంటే పడని వాడు, నెగెటివ్ స్టాండ్ తీసుకున్నవాడు.. కలెక్షన్స్ మీద కొంచెం తగ్గించి వేసి వాడి బులపాటం వాడు తీర్చేసుకుంటాడు. ఇంతేతప్ప జన్యూన్ ట్రాకర్ ఎవరు అనేది ఎవరికి తెలియడం లేదు. దీనికంటూ ప్రామాణికాలు కానీ, ఒక బ్రాండ్ కానీ ఏమి లేదు.
ఇక పిఆర్ టీమ్స్ సెలెక్ట్ చేసే హ్యాండిల్స్ నుండి అయితే ఏ ఏరియాల నుండి ఎంత కలెక్షన్స్ పడుతుందో.. వాళ్ళకి షేర్ ఏమిటో, గ్రాస్ అంటే ఏమిటో, ఫిక్సడ్ హైయ్యర్స్ అంటే ఏమిటో, నెట్ అంటే ఏమిటో.. GST ఎంత కట్ అవుతుందో.. అనేది ఎటువంటి ఐడియా లేకుండానే ఎవడికి తోచిన లెక్కలు వాళ్ళు వేసి పారేస్తున్నారు. సరే ఇదంతా ఎవరి ఇష్టం వారిది అనుకోవచ్చు. కానీ ఈ కాకి లెక్కలు చిక్కులు తీసుకువస్తుంది మళ్ళీ సినిమా ఇండస్ట్రీకే. ఇలాంటి తొక్కలో లెక్కలు చూసే ప్రభుత్వాలు పంతానికి పోతున్నాయి. ఇలాంటి పనికిమాలిన లెక్కలు చూసే ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ రైడ్స్ కి దిగుతున్నాయి. వేసుకుంటున్నాం కదా అని వేసుకుంటూ వేసుకుంటూ పొతే రేపు మళ్ళీ ఇండస్ట్రీనే చిక్కుల్లో పడుతుంది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఏదైనా చర్యలు చేపడితే బాగుంటుంది. సినిమా టికెట్స్ కి విషయంలో ట్రాన్ఫరెన్సి కావాలని ఎలా కోరుకుంటున్నారో.. కలెక్షన్స్ విషయంలో కూడా ట్రాన్ఫరెన్సి చూపించాలిగా..
..పర్వతనేని రాంబాబు.