2024 ఎలక్షన్స్ హవా ఇంకా కనిపిస్తూనే ఉంది. ఆ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదేమో అనిపిస్తుంది. ప్రజాసంక్షేమ పాలనను తీసుకురావడం కోసం నడుం కట్టిన, భుజం కలిపిన నాయకులిద్దరూ రాష్ట్రంలో సునామి సృష్టించారు. వైసీపీ కోటలు బీటలు వారడం కాదు, పునాదులే కదిలే ప్రకంపనలు పుట్టించారు. పోలింగ్ బూతులు దద్ధరిల్లాయి. ఓటింగ్ పర్శంటేజ్ హోరెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా ఓటర్లు అందరిలోనూ కొత్త చైతన్యం వచ్చింది, వ్యతిరేఖత వెల్లువెత్తింది. కట్ చేస్తే.. వైస్ జగన్ కి ఎప్పటికి మింగుడుపడని పరాజయం ఎదురైంది.
ఇక తెదేపా పాలన మొదలయ్యింది, అభివృద్ధి కార్యక్రమాలు అలవోకగా జరిగిపోతాయనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో సుస్పష్టంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆంధ్ర రాష్ట్రంలోని ఎమ్యెల్యేలు, మంత్రులు ఇప్పటికే వాళ్ళ కార్యనిర్వహణలోకి దిగిపోయారు. అన్నిటిని మించి, అందరిని మించి ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే తన విధుల నిర్వహణలోకి వెళ్లిపోయారు చంద్రబాబు.
ముఖ్యమంత్రిగా తను చేస్తానన్న మొదటి మూడు సంతకాలను పూర్తి చేసిన చంద్రబాబు అరక్షణం ఆలస్యం చెయ్యకుండా పోలవరం ప్రాజెక్ట్ వైపు కదిలారు. అక్కడి జనం ఆయనకి బ్రహ్మరధం పడుతున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, ఆయన కాళ్లపై పడిన వాళ్ళెందరో.. కన్నీటితో ఆయన కాళ్ళు కడుగుతున్నవాళ్ళు ఎంతమందో. అధికారం అంటే అహంకారం కాదు బాధ్యత అని ఎప్పటికప్పుడు చూపించే చంద్రబాబు నే ఆశాదీపం అనుకుంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. నిజాయితీ పరుడు అనే నినాదం గట్టిగా వినిపిస్తోంది. మంచి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో దృఢంగా కనిపిస్తుంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబే స్వయంగా పవన్ భుజం తడుతూ.. అతనికి అంతగా విలువిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత. నిన్న చంద్రబాబుకి పోలవరంలో ఎటువంటి ఘన స్వాగతం లభించిందో, అదే తరహా అరుదైన అనుభూతిని పవన్ కి పంచారు అమరావతి ప్రజలు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దాదాపు ఎనిమిది టన్నుల పువ్వులు తెప్పించి అమరావతి వివాదం సందర్భంలోను, చంద్రబాబు జైలు సమయంలోను అండగా నిలబడి కూటమికి బాట వేసి ఘన విజయాన్ని మా గుమ్మం ముందుకు తెచ్చిన పవన్ కళ్యాణ్ కి పుష్పాలతో స్వాగతం చెబుతామని, మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న అతని కాలు కందనివ్వకుండా చూసుకుంటామని అంటూ అక్కడ పలికిన స్వాగతం ఖచ్చితంగా పవన్ మనసుని కూడా కదిలించే ఉంటుంది. చంద్రబాబు కళ్ళు సైతం చెమర్చే ఉంటాయి. ఇక జరిగేది అమరావతి నిర్మాణమే. మనం చూడబోయేది ఐదు కోట్ల ఆంధ్రుల కలల సౌధం రాజధానినే.!